
Corona Effect on Students: చదువు రాకముందు కాకరకాయ అంటే చదువుకున్నాక కీకరకాయ అన్నాడట. అలా ఉంది మన విద్యావిధానం. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూత పడిన సంగతి తెలిసిందే. కానీ చదువులు కూడా అటకెక్కి పోయాయి. నేర్చుకున్నది కాస్త మరిచిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో విద్యార్థుల నైపుణ్యం తగ్గినట్లుగా తెలుస్తోంది. కనీస అభ్యసన సామర్థ్యాలు సైతం పడిపోయాయి. తెలుగులో పదాలు రాయడం కూడా కష్టంగా ఉంటోంది. యునెస్కో సేవ్ ది చిల్ర్డన్, యంగ్ లైవ్స్ తదితర సంస్థలు చేసిన అధ్యయనాల్లో పిల్లల సామర్థ్యం తగ్గినట్లు వెల్లడైంది.
పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల్లో చదువుపై శ్రద్ధ తగ్గింది. మూడు ముక్కల్లో చెప్పాలంటే మన పాఠశాల విద్యార్థులు తెలుగు పదాలు తప్పులు లేకుండా రాయడం లేదు. లెక్కలు చేయలేరు. ఆంగ్లంలో చదవలేరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో ఈ విద్యాసంవత్సరం 3-6 తరగతులు చదువుతున్న పిల్లల విద్యా సామర్థ్యాల స్థాయిని నిర్ధారించేందుకు ప్రశ్నపత్రాలిచ్చి చేసిన సర్వేల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి.
సగటున 46 శాతం మంది బొమ్మలను చూసి తెలుగులో రాయలేకపోతున్నారు. గణితంలో 48 శాతం మంది కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారని తెలుస్తోంది. 44 శాతం మంది ఆంగ్లంలో పదాలు రాయలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. కొందరైతే తెలుగులో పదాలు కూడా రాయలేని వారున్నారు. మూడో తరగతి ప్రశ్నపత్రాన్ని ఆరో తరగతి విద్యార్థులు కూడా చేయలేకపోతున్నారని సర్వేలో తెలిసింది. ఇదంతా చూస్తుంటే మన విద్యావ్యవస్థ ఎక్కడికి పోతోందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా నేపథ్యంలో 2020 సంవత్సరం మార్చి నుంచి పాఠశాలలు మూతపడ్డాయి. 2021లో కూడా రెండు మూడు నెలలు నడిచినా తరువాత మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కానరావడం లేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆన్ లైన్ పాఠాలతో విద్యార్థులకు ప్రయోజనం ఏం జరగడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఫోన్లు, టీవీ, నెట్ సదుపాయం లేకపోవడంతో ఎక్కువ మంది పిల్లలు తరగతులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులందరికి విద్య నేర్పించడంలో నైపుణ్యత పాటించి వారిని తమ ప్రతిభ పెంచుకునేందుకు వీలు కల్పించాలి. విద్యా సామర్థ్యాలను పరీక్షించేలా ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలి. పిల్లల్లో మంచి భవిష్యత్ కోసం వారిని తయారు చేసేందుకు పాఠశాలలు బలోపేతం కావాలి. విద్యార్థుల నైపుణ్యత సాధించాలి. ప్రభుత్వాలు విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.