
పెరిగేదేమో రూపాయల్లో తగ్గేదేమో పైసల్లో.. మన ఘనత వహించిన మోడీ సర్కార్ హయాంలో పెట్రో డీజిల్ రేట్లు పెరగడమే కానీ.. ‘తగ్గేది లే’ అనే పరిస్థితి ఉంది. అయితే దేశంలో ఎప్పుడూ లేని స్థాయిలో మోడీ సర్కార్ వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలకు పట్టపగ్గాలేకుండా పోయాయి. ఏకంగా రూ.100 దాటేసింది. ఇంకా పరుగులు పెడుతూనే ఉంది.
అయితే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని అనగానే వినియోగదారులు ఆశగా చూశారు. బీజేపీ శ్రేణుల పెట్రోల్ ధర తగ్గిందన్న ప్రచారాన్ని హోరెత్తించారు. కానీ చివరకు ఎంత పెరిగిందన్నది తరిచి చూస్తే అంతా షాక్ అయిన పరిస్థితి.
దాదాపు గత నెలరోజులుగా స్థిరంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం విశేషం. లీటర్ పెట్రోల్ పై 14 పైసలు, డీజిల్ పై 18 పైసలు తగ్గించారు. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.69, డీజిల్ ధర రూ.97.15కు చేరింది.
ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు తగ్గడంతో దేశీయ విక్రయ సంస్థలు తగ్గించాయి. ఎంత తగ్గించాయని ఆశగా చూస్తే కేవలం పైసల్లోనే తగ్గడం చూసి వినియోగదారులు షాక్ తిన్నారు.
జులై నుంచి దేశంలో చమురుధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ స్థిరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ధరలు మొత్తం 41 సార్లు పెట్రో ధరలను పెంచిన విషయం తెలిసిందే. దాదాపు ఒక నెల రోజుల పాటు రోజు విడిచి రోజు ధరలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.11.14, డీజిల్ ధర రూ.8.74 మేర పెరగడం గమనార్హం.