
కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో వైరస్ కేసుల సంఖ్య దేవుడెరుగు.. లెక్కలెనన్నీ ప్రాణాలు పోతున్నాయి. దాదాపు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలో తోచక తల పట్టుకుంటోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు తమ ప్రజలను కాపాడుకునేందుకు రకరకాల పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆరోగ్య వంతులను చేస్తున్నాయి. ముఖ్యంగా పేద ప్రజలను కరోనా బారి నుండి కాపాడుకునేందకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ వైపు ప్రైవేట్ ఆసుపత్రుల అధిక బిల్లులను కట్టడి చేస్తూనే మరోవైపు పేద ప్రజలకు నాణ్యమైన వైద్యమందించేందుకు జగన్ వేసిన ప్రణాళిక వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. గతంలో 11000 మార్క్ దాటిన కేసులు ఈసారి 22000 వరకు చేరాయి. మరోవైపు మృతుల సంఖ్య కూడా తీవ్రంగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ ను ప్రకటించింది. ఉదయం పూట నాలుగు గంటలు మాత్రమే వెసులుబాటు ఇచ్చింది. అదీ నిత్యావసరాలకు అవకాశమిచ్చి ఆ తరువాత కర్ఫ్యూను విధించింది. దీంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లకే పరిమితమయ్యారు.
మరోవైపు కరోనా సోకిన రోగులను కూడా ప్రభుత్వం కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా జగన్ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చడంతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతోందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 1,11,266 మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కరోనా ట్రీట్ మెంట్ ఇచ్చింది. దీంతో చాలా మంది ప్రాణాలను కాపాడినట్లయింది. ఈ పథకంపై జగన్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో నైతే రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
మరోవైపు జగన్ అత్యంత అవసరమైన ఆక్సిజన్ కోసం సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించుకున్న జగన్ తొందర్లోనే కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. ఇలా జగన్ కరోనా విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేయడం తగ్గించిందనే వాదన వినిపిస్తోంది.