నిర్మల్ జిల్లా భైంసా మళ్లీ రణరంగంగా మారింది. ఇద్దరు యువకులు చేసిన దురుసైన పనికి మొదలైన చిన్న గొడవ రెండు వర్గాల వారు కొట్టుకునేదాకా వెళ్లింది. కత్తులతో దాడులు చేసుకునేదాకా సాగింది. ఈ ఘర్షణల్లో ఓ రిపోర్టర్ కు కత్తిపోట్లు కాగా.. మరొక రిపోర్టర్ తల పగిలింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమంది అల్లరి మూకలు వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు, ఏడుగురు స్తానికులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
కత్తిపోట్లకు గురైన రిపోర్టర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పడంతో భైంసాలో రాత్రికి రాత్రే 600 మంది పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మొదట ఇద్దరు వ్యక్తుల నడుమ చిన్నపాటి గొడవ జరిగింది. ఇది ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. జుల్ఫేర్ గల్లీలో మొదలైన ఘర్షణ కుభీర్ రోడ్, గణేష్ నగర్, మేదరిగల్లి, బస్టాండ్ ప్రాంతాలకు విస్తరించినట్లు సమాచారం. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భైంసాలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేశారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
భైంసా అల్లర్లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ లో స్పందించారు. అల్లర్లను ఖండించారు. ‘భైంసాలో జరిగిన అల్లర్లను ఖండిస్తున్నాను. అల్లర్లలో ఇద్దరు రిపోటర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయపడటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. రిపోర్టర్లు, పోలీసులపై దాడి చేస్తారా ? మనం భారత్ లో ఉన్నామా ? పాకిస్థాన్ లో ఉన్నామా ?’ అని మండిపడ్డారు.
పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలకు భయపడి పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాయొద్దని హితవు పలికారు. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసాలో తరుచు అల్లర్లు జరుగుతున్నాయని..ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్ తరలించాలని సూచించారు.