సీఎం కేసీఆర్ సంచలనం.. భూముల డిజిటల్ సర్వేకు ఆదేశం

తెలంగాణలో భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దాన్ని కార్యరూపం దాల్చేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూములను డిజిటల్ సర్వే చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (ఆక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, […]

Written By: NARESH, Updated On : February 19, 2021 5:07 pm
Follow us on

తెలంగాణలో భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దాన్ని కార్యరూపం దాల్చేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూములను డిజిటల్ సర్వే చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి.. వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (ఆక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం శ్రమించి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతం అయ్యిందని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: నటుడు మోహన్ బాబుకు షాకిచ్చిన టీఆర్ఎస్ సర్కార్

ధరణి పోర్టల్, రెవెన్యూ సంస్కరణల పనితీరుపై సమీక్షించిన కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమయింది. నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సిసిఎల్ఏ, సిఎస్ కూడా రికార్డులను మార్చలేరు. అంతా సిస్టమ్ డ్రివెన్(వ్యవస్థానుగత) పద్దతిన, హ్యూమన్ ఇంటర్ఫేస్ (మానవ ప్రమేయం) లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడడం లేదు. ధరణి పోర్టల్ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నారు. అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నారు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి ప్రజలు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Also Read: హైకోర్టు న్యాయవాది వామనరావు ఎవరు? ఎలాంటి వారు? ఎందుకు చంపారు?

‘‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారం అవుతాయి. నేను అసెంబ్లీలో ఇంతకుముందే ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతీ భూమికి కో ఆర్డినేట్స్ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. నిజానికి ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభం అవుతుంది. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి. కో ఆర్డినేట్స్ మారవు కాబట్టి భవిష్యత్తులో కూడా హద్దుల పంచాయతీకి అవకాశం ఉండదు. భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జిడిపి 3-4 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం సిద్ధపడింది’’ అని సీఎం స్పష్టం చేశారు.

‘‘ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాల’’ అని సీఎం చెప్పారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్