
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఇప్పుడు ఏపీలో ఉధృతమవుతోంది. రాజకీయరంగు పులుముకుంది.. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్ర మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్ కోసం అందరూ రాజీనామా చేయాలని పిలుపునివ్వడంతో ఉద్యమరూపం దాల్చింది. మిగతా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. కార్మికులు, ప్రజలు రాజీనామాలు చేయాలని వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
ప్రతిపక్ష టీడీపీ సైతం దీనిపై ఉద్యమించాలని డిసైడ్ అవుతోంది. హీట్ పెరగడంతో ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎట్టకేలకు సీఎం జగన్ స్పందించారు. ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచించాలని ఆయన కోరారు. ప్లాంట్ ను బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరారు.
విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 20వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని ప్రధానికి సీఎం తెలిపారు.
విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదం, ప్రజల పోరాట ఫలితంగా వచ్చిందని.. దశాబ్ధం ఈ పోరాటం సాగిందని.. ఇందులో 32 మంది చనిపోయారని ప్రధానికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్లాంట్ పరిధిలో దాదాపు 19700 ఎకరాల విలువైన భూములున్నాయని.. ఈ భూముల విలువే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని జగన్ లేఖలో వివరించారు.
డిసెంబర్ లో రూ.200 కోట్ల లాభం విశాఖ స్టీల్ కు వచ్చిందని.. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ అప్పులు తేరుతాయని.. ప్రైవేటీకరణ చేయవద్దని జగన్ లేఖలో కోరారు. ఫ్యాక్టరీకి సొంత గనులు లేకపోవడం.. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ధరకు ముడి ఖనిజాన్ని కొనడమే నష్టాలకు కారణం అని.. గనులు కేటాయించాలని జగన్ లేఖలో కోరారు.