ఏపీలో చంద్రబాబు పరిపాలన అంతా సవ్యంగా సాగిందని టీడీపీ నేతలు అనుకుంటారు. కానీ టీడీపీ పాలనలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీకావని వైసీపీ సర్రార్ అంటోంది. ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు తవ్వితీసి ఆయనను జైలుకు పంపింది. .. ప్రస్తుతం ఒక్కొక్కటిగా అవి వెలికి తీసే పనిలో జగన్ సర్కార్ పడింది. తాజాగా మరో సంచలన విషయం బయటపడింది. చంద్రబాబు పాలనలో ఉద్యోగుల సీపీఎస్ పింఛన్ సొమ్మకు ఎసరు పెట్టారనే విషయం వెలుగుచూసింది.. ఉద్యోగులకు వరుసగా రెండేళ్లు ఎగనామం పెట్టారని తేలింది. 2017లో రూ.730 కోట్లు.. 2018..19లో రూ.663 కోట్ల రూపాయాలను డిపాజిట్ చేయకుండా దాచుకున్నారు. ఇన్ని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సర్కారు ఉద్యోగులకు సమస్యలున్నాయంటూ.. ముసలి కన్నీరు కారుస్తుండడం విశేషంగా చెప్పొచ్చు.
ఈ విషయమై ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. టీడీపీ హయాంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) పెన్షన్ సొమ్ము వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు.. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు జమ చేయకుండా.. తన సొంత ఖజానాకు మళ్లించుకున్నారని ఉద్యోగులు మండి పడుతున్నారు. తమకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు జరపాలని కోరుకుంటుంటే.. టీడీపీ నేతలు సీపీఎస్, జీపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. 2017-18కి సంబంధించి ఉద్యోగులకు రూ.730 కోట్ల పెన్షన్ సొమ్మును జమ చేయకుండా టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.
నేషనల్ డిపాజిటరీ లిమిడెడ్ కు ఈ సొమ్ము బదిలీ చేయనందున వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై పడడమే కాకుండా.. ఉద్యోగుల సొమ్మును టీడీపీ సర్కారు సొంతానికి వాడుకుందని కాగ్ స్పష్టం చేసింది. దీని వల్ల ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి నెలకొనడమే కాకుండా.. మొత్తం పథకమే విఫలమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 2018-19 మార్చి 31 నాటికి సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి.. పెన్షన్ సొమ్ము.. రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ కు జమ చేయకుండా తరువాత సంవత్సరానికి వాయిదా వేసినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. నిబంధనల ప్రకారం.. ఉద్యోగుల చందాలకు సమానంగా ప్రభుత్వం కూడా చందాలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగుల నుంచి రూ.765.02 కోట్లు వసూలు చేసిన గత ప్రభుత్వం తన వాటాకింద కేవలం రూ.320 కోట్లు మాత్రమే చెల్లించిందని.. ఇంకా రూ.444.44 కోట్ల మేరా.. తక్కువగా చెల్లించిందని కాగ్ నివేదిక చంద్రబాబు గురించి విస్తుపోయే నిజాలు వెల్లడించింది.
పిల్లల వివాహాలు.. ఇతర అవసరాలకు అక్కరకు వస్తాయని ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బలును గత ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ఇవ్వకుండా.. వేల సంఖ్యలో బిల్లులు పెండింగులో ఉంచింది. ఉద్యోగుల మెడికల్ రీ యింబర్స్ మెంట్ బిల్లులు సైతం పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఉద్యోగుల డీఏను కూడా ఇవ్వకుండా టీడీపీ సర్కారు.. 2019 ఎన్నికలకు ముందు పోస్టు డేటెడ్ జీవోలు జారీ చేసి మోసం చేసింది.
ఎన్నికలకు ముందు పీఆర్ సీలు అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక పీఆర్సీ నివేదిక రానప్పటికీ.. ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడమే కాకుండా.. చంద్రబాబు సర్కారు పెండింగులో పెట్టిన రెండు డీఏలను సైతం మంజూరు చేశారు.