సాధారణంగా పెళ్లిళ్లు, బరాత్ లలో వరుడు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ స్టేజీపై, రోడ్లపై హోరెత్తిస్తారు. తల్లిదండ్రులను వీడుతున్న బాధలో వధువులు ముభావంగా ఉంటారు. పెద్దగా డ్యాన్సులు గట్రా చేయరు.
కానీ ఇక్కడ ట్రైన్ రివర్స్ అయ్యింది. వరుడు కామ్ గా రోడ్డు మీద చూస్తుండగా.. వధువు పెళ్లి బరాత్ లో రెచ్చిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘బుల్లెట్ బండి’ పాటకు వధువు చేసిన డ్యాన్స్ చూసి పెళ్లికి వచ్చిన వారంతా కేరింతలు కొడుతూ చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.ఇక వరుడు వధువు ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుందని తెలియక అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు. స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో రెండు స్టెప్పులేసి ఊరుకున్నాడు.
వధువు మాత్రం ‘బుల్లెట్ బండి’ సాంగ్ మొత్తం అర్థవంతంగా.. అచ్చం అలాంటి సినిమా స్టెప్పులతోనే డ్యాన్స్ చేసి ఉర్రూతలూగించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గాయని మోహన భోగరాజు పాడిన ఈ ‘బుల్లెట్ బండి’ పాట సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటకు నవవధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్ లో మార్క్ ఫెడ్ ఎండీగా పనిచేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్ అధికారి పి.నరహరి ట్వీట్ చేశారు. గాయని మోహనకు ట్యాగ్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా జగిత్యాల జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో ఈ వీడియో తీశారని.. వధువు రెచ్చిపోయి డ్యాన్స్ చేసిందని అంటున్నారు. కొత్త పెళ్లి కూతురు స్టెప్పులకు పెళ్లికొడుకు సహా పెళ్లికొచ్చిన వారంతా ఫిదా అయిపోయారు. ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..