
ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలని అనిపిస్తే ముందుగా మనకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గుర్తుకువస్తాయి. ఈ రెండు ఈ కామర్స్ సంస్థల్లో దొరకని వస్తువు ఏదో ఉండదు. క్వాలిటీ వస్తువులు తక్కువ ధరకే ఆన్ లైన్ లో లభించే అవకాశం ఉండటంతో ప్రజలు కూడా ఈ సైట్ల ద్వారా షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. వేగంగా డెలీవరీ చేయడం కూడా ప్రజలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో షాపింగ్ చేయడానికి ఇష్టపడేలా చేస్తుంది.
అయితే గూగుల్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆన్ లైన్ ద్వారానే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో గూగుల్ అతి త్వరలో ప్రజలకు యూట్యూబ్ ద్వారా షాపింగ్ చేపే అవకాశం కల్పిస్తోంది. చిన్నపిల్లలకు అవసరమైన వస్తువుల నుంచి నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల వరకు ప్రతి ఒక్కటి యూట్యూబ్ లోనే కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో సైట్ గా యూట్యూబ్ కు మంచి పేర్ ఉంది. మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ప్రతి ఒక్కరికీ యూట్యూబ్ సుపరిచితమే. ఇప్పటికే యూట్యూబ్ క్రియేటర్లను ఈ విషయం గురించి సంప్రదించింది. యూట్యూబ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ప్రోడక్టుల ఫీచర్లను ట్యాగ్ చేయడంతో పాటు ట్రాక్ చేయవచ్చని తెలిపింది. అనంతరం గూగుల్ అనలిటిక్స్ అండ్ షాపింగ్ టూల్స్ తో ఈ డేటా లింక్ అవుతుందని తెలుస్తోంది.
యూజర్లు వీడియో చూస్తూ యూట్యూబ్ లో షాపింగ్ చేసుకునేలా గూగుల్ ముందడుగులు వేస్తోంది. గూగుల్ యూట్యూబ్ వీడియోలను కేటలాగ్స్‌గా మార్చుకుని వాటిపైనే క్లిక్ చేసి సులువుగా కొనే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే గూగుల్ యూట్యూబ్ లో షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టడం గురించి పలు నివేదికలు వెలువడ్డాయి. అతి త్వరలో యూట్యూబ్ లో షాపింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.