
మన నిత్య జీవితంలో ఆధార్ కార్డుకు ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఏ పథకం పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి. ఐడెంటిటీ కార్డుగా కూడా ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ లేకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆధార్ కార్డ్ ఉన్నా కార్డుల్లో తప్పులు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.
ఆధార్ కార్డులోని వివరాలను కొన్ని డాక్యుమెంట్ల సహాయంతో సులభంగా మార్చుకోవచ్చు. చాలామందికి ఆధార్ కార్డులో తప్పులను ఏ విధంగా సరిదిద్దుకోవాలో అవగాహన ఉండదు. పేరు, వయస్సు, అడ్రస్, నివాస స్థలం, ఇతర వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవడానికి వెబ్ సైట్ లో పొందుపరిచిన డాక్యుమెంట్లలో ఒక్క డాక్యుమెంట్ ఇచ్చినా సరిపోతుంది.
ఆధార్ కార్డ్ వివరాలను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో మార్చుకోవచ్చు. ఆఫ్ లైన్ లో ఆధార్ కార్డ్ వివరాలను మార్చుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లోని పుట్టినతేదీ మార్చుకోవాలంటే పాస్పోర్ట్, పాన్ కార్డు, మార్క్ షీట్, బర్త్ సర్టిఫికెట్ సహాయంతో సులువుగా మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే పాస్బుక్, రేషన్ కార్డు, పోస్టాఫీస్ అకౌంట్ స్టేట్మెంట్, ఓటర్ ఐడీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు ఉంటే సరిపోతుంది.
ఆధార్ కార్డులో వయస్సు మార్చుకోవాలంటే సరైన వయస్సు ఉన్న గుర్తింపు కార్డ్ సహాయంతో మార్చుకోవచ్చు. ఆన్ లైన్ లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.