తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటన మరోసారి వాయిదా పడింది. కొత్త సంవత్సరంలో కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ తాజాగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లోని కొత్తగా చేరిక వారికి.. పాత నేతలకు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఠాకూర్ వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ప్రకటన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనే చేస్తారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే టీపీసీసీపై ఒక అభిప్రాయాన్ని వచ్చింది. అయితే కాంగ్రెస్ నేతలు జోరుగా లాబీయింగ్ చేస్తుండటంతో టీపీసీసీ చీఫ్ ప్రకటన మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది.
టీపీసీసీని ఆశిస్తున్న నేతలంతా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. సాయంత్రం 4గంటలకు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటి కానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం ఢిల్లీలో పీసీసీ కోసం లాబీయింగ్ చేస్తున్నారు.
తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీతో భేటి అయి పీసీసీపై చర్చించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. సాయంత్రం రాహుల్ కోమటిరెడ్డి భేటి అయ్యే అవకాశం కన్పిస్తోంది.
వీరితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఢిల్లీబాటపట్టారు. కాంగ్రెస్ నేత సంపత్.. మల్లు భట్టివిక్రమార్క తదితరులు వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరితోనూ రాహుల్ గాంధీ సాయంత్రం భేటి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నారు.
టీపీసీసీ కోసం నేతలు ఢిల్లీ బాటపట్టడం.. లాబీయింగ్ జోరుగా చేస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. దీంతోనే మరోసారి టీపీసీసీ ప్రకటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో టీపీసీసీ ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.