
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే అమ్మఒడి పథకం తీసుకొచ్చి ప్రతీ పేద విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నారు. నగదు వద్దనుకున్న వారికి లాప్ టాప్ అందిస్తున్నారు. తద్వారా.. నాణ్యమైన చదువులు అందించడానికి ఆస్కారం ఉంటుందని సీఎం అంటున్నారు. కేవలం పథకం ప్రవేశపెట్టడం.. నగదు అందించడంతోనే ఆగిపోకుండా విద్యార్థుల చదువులపై కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు జగన్. ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలని.. ఒకవేళ రాకుంటే.. నేరుగా తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. తద్వారా హాజరుశాతం పెరిగి.. విద్యార్థులు చదువుల్లో ముందు వరుసలో ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్ ను తయారు చేయాలని సూచించిన సీఎం విద్యార్థుల వివరాలు యాప్ లో నమోదు చేయాలని వివరించారు.
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సీఎం జగన్ వివరించారు. పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 49వేల మంది సిబ్బందికి సులభ్ సంస్థతో శిక్షణ ఇప్పించాలని సూచించారు. పాఠశాలల్లో నాడు.. నేడు కార్యక్రమంపై జగన్ సమీక్షించారు. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. రెండో విడత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మధ్యహ్న భోజన పథకం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని.. పక్కాగా నిర్వహించాలని సూచించారు.
నాడు..నేడు.. రెండు విడత పనులను ఏప్రిల్ 15నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. డిసెంబరు 31లోపు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, ఇందుకు రూ.4446 కోట్లు వ్యయం కానుందని వెల్లడించారు. మొదటి విడతకు సుమారు 3700 కోట్లు ఖర్చవుతోందని.. పాఠశాలలను బాగు చేసేందుకు ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం చరిత్రలో జరగలేదని.. ఇదే మొదటిసారి అధికారులు సీఎంకు వివరించారు. పాఠశాలల పున:ప్రారంభం.. విద్యార్థుల హాజరుపై సీఎంకు అధికారులు నివేదిక అందించారు. పిల్లల హాజరుపై యాప్ రూపొందించారా..? లేదా..? అని సీఎం అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 15నుంచి పిల్లల హాజరు వివరాలను యాప్ ద్వారా సేకరిస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు. పిల్లలు బడికి గైర్హాజరు అయితే.. తల్లిదండ్రుల సెల్ ఫోనుకు సందేశం వెళ్లాలని.. రెండోరోజు వలంటీరును పంపించి.. వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సచివాలయానికి రానున్నారు. గతేడాది డిసెంబరు 18న కేబినెట్ సమావేశం అనంతరం సుదీర్ఘ విరామం తరువాత హైపర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కోసం సీఎం సచివాలయానికి వెళ్తున్నారు. గతకొంత కాలంగా కరోనా నేపథ్యంలో కేవలం కేబినెట్ సమావేశాలకే సీం జగన్ సచివాలయానికి వస్తున్నారు.