ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే దేశమంతా ఓ మంచి పేరు.. ఆంధ్రారాజకీయాల నుంచి వచ్చిన అన్న ఎన్టీఆర్ ఢిల్లీలో తొడగొట్టి తెలుగువాడి సత్తాను దేశానికి చాటిచెప్పాడు. ఇక ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్ఆర్ లు తమదైన ముద్ర వేశారు. తెలుగు వాడు పీవీ నరసింహారావు యావత్ భారతావణిని ఏలి సంస్కరణలు అమలుచేసి భారత ఆర్థిక పురోగతి ఊపిరిపోశాడు. కానీ ఇదంతా ఒక చరిత్ర..
ఇప్పటి రాజకీయం వేరు.. కుళ్లు, కుతంత్రాలతో ఆంధ్రా రాజకీయం నడుస్తోంది. ప్రత్యర్థులను బలి చేయడమే ఎజెండాగా కొనసాగుతోంది. తన పర భేదం లేదు.. పక్కోడిపై బురద జల్లడమే పరమావధి అవుతోంది. రాజకీయ నేతలు, వ్యవస్థలు కూడా పార్టీల పరంగా చీలిపోయాయన్న ఆరోపణలున్నాయి. వ్యక్తులు వ్యవస్థలను మెయింటేనే చేసే స్థాయికి చేరారు. వ్యవస్థలు పక్షపాతం చూపిస్తున్నాయనే అపవాదు మూటగట్టుకుంటున్నాయి. ఆదర్శంగా నిలవాల్సిన వ్యవస్థల మీద ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నీతి, నిజాయితీ లేకుండా కాపుకాస్తున్న సంస్కృతి ఏపీలో పెచ్చరిల్లిపోతోంది. వ్యక్తిగత వైరాలకు వ్యవస్థలను బలి చేస్తున్న వైనం ఏపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలోని ఒక్కో వ్యవస్థపై ఒక్కో ఆరోపణ.. కొందరికీ మేలు చేసేలా ఉన్నాయని విమర్శలు.. ఇలా మొత్తం ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు భ్రష్టుపట్టిపోయింది. ఫిర్యాదులతో ఆంధ్రా పరువును నడిబజారులో నిలబెడుతున్నారు.
*నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్
ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి అత్యున్నత గౌరవం పొందిన ఎన్నికల కమిషనర్ ఒక ప్రభుత్వాధినేతతో ఢీకొంటున్నాడు. దీని వెనుక ఎవరున్నారన్నది అందరికీ తెలిసిందే.. ఏపీ సీఎం జగన్ తో తలపడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏపీలో ఎన్నికల వ్యవస్థతోనే ఆట ఆడుకుంటున్నారు. ప్రభుత్వంతో ఢీకొంటున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ఊరుకుంటాడా? అంతే దూకుడుగా ఎదుర్కొంటున్నాడు. ఫలితం అటు స్థానిక ఎన్నికలు జరగక.. నిధులు ఆగిపోయి క్షేత్రస్థాయిలో పాలన పడకేసింది. నాటి సీఎం చంద్రబాబు నామినేట్ చేసిన నిమ్మగడ్డ ఒక అధికారిగా కంటే అంతకుమించి జగన్ ప్రభుత్వాన్ని సాధిస్తున్నారు. చంద్రబాబు వెనుక ఉండి నిమ్మగడ్డను ఆడిస్తున్నాడన్న విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారు. అయినా కూడా పట్టువదలకుండా ఒక అధికారి చేయాల్సిన దానికంటే కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక జగన్ సైతం అంతే దూకుడుగా నిమ్మగడ్డతో ఫైట్ చేస్తున్నారు. వీరిద్దరి వైరం దేశవ్యాప్తంగా ఏపీ పరువు తీస్తోంది. ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ ముందుకు పోతుండగా.. అడ్డుకోవాలని జగన్ సర్కార్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పంచాయితీలోకి తాజాగా కేంద్రాన్ని లాగారు. ఎడతెగని వీరి పట్టుదలలు, పంతాలకు ఏపీ బలి అవుతోంది..
*ఏపీ హైకోర్టు వర్సెస్ సీఎం జగన్
దేశవ్యాప్తంగా రోజూ ఎన్నో తీర్పులు వస్తున్నాయి. కానీ ఏపీ హైకోర్టు తీర్పులు మాత్రం జగన్ సర్కార్ ను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఈ మధ్య కొత్త పార్లమెంట్ కడుతున్నారని కొందరు సుప్రీంకోర్టులో అభ్యంతకర పిటీషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి న్యాయవ్యవస్థకు లేదని.. అలా చేయడం కూడా కరెక్ట్ కాదని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకుండా ఆపడం కరెక్ట్ కాదంటూ ’ వ్యాఖ్యానించింది.కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్ సర్కార్ అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల సహా ఎన్నో బిల్లులు, నిర్ణయాలను ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. కోర్టులన్నీ ఒకటే కానీ తీర్పులే వేరు అని ఇక్కడ నిరూపితమైంది. దీనికి కారణాలు ఏమిటన్నది అప్రస్తుతం.. కానీ సీఎం జగన్ ఆరోపించినట్టు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని అన్న మాట మాత్రం ఇక్కడ అందరూ నమ్మేలా చేసింది. దీనిపై సీఎం జగన్ అప్పట్లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు చర్చనీయాంశమయ్యాయి. ఈ బదిలీల వెనుక సీఎం జగన్ లేఖనే ఉందనేది ఓ ప్రధాన ఆరోపణ. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు న్యాయవ్యవస్థ ప్రతిష్ట.. ఇటు రాజకీయ నాయకులు ఏకంగా న్యాయవ్యవస్థనే కదిలించారన్న అప్రతిష్ట ప్రచారమైంది.. ఇప్పుడు ఈ రెండు వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది.
* కొమ్ముకాసిన ఏబీ వెంకటేశ్వరరావు పరిస్థితి ఇదీ
అధికారం బెల్లం లాంటిది..ఐదేళ్లలో కరిగిపోతూనే ఉంటుంది. నేతలను నమ్ముకొని అధికారులు ప్రత్యర్థులపై విరుచుకుపడితే ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఈ ఏపీ ఐపీఎస్ పరిస్థితి చూస్తే అందరికీ అర్థమవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఎటూకాకుండా అయిపోయారు. జగన్ సర్కార్ ఆగ్రహ జ్వాలల్లో ఆయన బలైపోయారు. ఇప్పుడు కాపాడడానికి చంద్రబాబు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.. ప్రజాప్రతినిధుల తాత్కాలిక అధికారం అడ్డుపెట్టుకొని అధికారులు దూకుడుగా ప్రవర్తిస్తే ఎంతటి ఉపద్రవం ఎదురవుతుందో ఏబీ వెంకటేశ్వరరావు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను చాలా ఇబ్బందులు పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీనిపై వైసీపీ నేతలు ఈసీకి నాడు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే సీఎంగా జగన్ అయ్యాక ఏబీ వెంకటేశ్వరరావు కథ మారిపోయింది. ఆయనపై కేసు కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని పక్కనపెట్టారు. పోస్టింగ్ ఇవ్వలేదు. అనంతరం కేసు కారణంగా సస్పెండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ ప్రభుత్వం తాజాగా నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని ఏబీకి సీఎస్ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా లేదా వ్యక్తిగతంగా ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజాగా సీఎస్ ఏబీని సస్సెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఇజ్రాయెల్ సంస్థ ఆర్.టి. ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ నుంచి నిఘా సామగ్రిని కొనుగోలు చేసే విషయంలో అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని.. తన కొడుకు యాజమాన్యంలోని కంపెనీకి కాంట్రాక్టును ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం విచారణ జరిపి ఫిబ్రవరి 8న వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను సవాలు చేస్తూ నాడు ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ తలుపులు తట్టాడు. కానీ క్యాట్ ఈయన పిటిషన్ ను కొట్టివేసింది. కేసులను నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తరువాత క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించినా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం తాజాగా నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసింది. ఇక తనకు న్యాయం చేయాలని.. ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఐపీఎస్ సంఘాలకు లేఖ రాసినా ఆయనపై ఆరోపణల నేపథ్యంలో వారు కూడా పట్టించుకోలేదు. దీన్ని బట్టి ఐదేళ్లు ఉండే నేతల మాయాజాలంలో పడి అధికారులు పనిచేస్తే చివరకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతంతో నిరూపితమైందని అధికార వర్గాల్లో తీవ్రచర్చ జరుగుతోంది..
*ఏపీ ఎంప్లాయిస్ ఎన్జీవోస్ వర్సెస్ నిమ్మగడ్డ
ఎక్కడైనా సరే రాజ్యాంగ వ్యవస్థలకు అమిత అధికారాలు ఉంటాయి. ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని శాసించగలదు.. అధికారాలతో నడిపించగలదు. కానీ ఏపీలో మాత్రం నిమ్మగడ్డ ఎస్ఈసీగా అయ్యాక.. సీఎం జగన్ తో వైరం పెట్టుకున్నాక.. ఏపీ ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను జగన్ సర్కార్ పాటించడం లేదు. జగన్ ప్రభుత్వం ప్రకారం నిమ్మగడ్డ వెల్లడం లేదు. దీంతో ఏపీలో ఎన్నికల సంఘం మనుగడే ప్రశ్నార్థకం మారింది. ఇద్దరి వైరం వ్యవస్థ భ్రష్టుపట్టింది. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వేస్తే జగన్ సర్కార్ ఎలాగూ వ్యతిరేకించి కోర్టుకెక్కింది. కానీ నిమ్మగడ్డ తీరుపై ఆయన ఆదేశానుసారం పనిచేయాల్సిన ఏపీ ఉద్యోగ సంఘాలు తిరుగుబాటు లేవనెత్తాయి. ఏకంగా నిమ్మగడ్డపైనే ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు మండిపడడం సంచలనమైంది. అంతేకాదు.. జగన్ సర్కార్ కు మద్దతుగా స్తానికసంస్థల ఎన్నికలకు తాము సహకరించమని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేయడం కలకలం రేపింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. తాము సిద్ధంగా లేమని.. ఎన్నికలు పెట్టాలంటే పెట్టుకోవచ్చని.. ఎన్నికల విధులకు హాజరు కాలేమని.. అవసరమైతే కోర్టుకు వెళతామనడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ప్రభుత్వ అధికారయంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ అదుపాజ్ఞల్లో పనిచేయాలి.. కానీ ఇక్కడ ప్రభుత్వాధినేత కనుసన్నల్లో నడుస్తూ ఏకంగా స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థఅయిన ఎన్నికల సంఘంపైనే తిరుగుబాటు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరు కూడా ఇందుకు కారణం కావడంతో ఇందులో తప్పులు లెంకడం అంటే బురదలో రాయివేయడమేనని చెప్పొచ్చు.
*కమ్మ వర్సెస్ రెడ్లు
గడిచిన టీడీపీ ప్రభుత్వంలో అంతా ‘కమ్మ’ల మయం. చంద్రబాబు స్వయంగా కమ్మ సామాజికవర్గం వ్యక్తి కావడంతో ఆయన వర్గం వారే మంత్రులుగా.. అధికారులుగా.. వివిధ కీలక పదవుల్లో పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. రెడ్డి సామాజికవర్గ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలో రెడ్ల రాజ్యం నడుస్తోంది. అయితే సామాజిక న్యాయం పేరిట బీసీలు, కాపులు, కమ్మలకు జగన్ అగ్రతాంబూలం ఇచ్చినా ఓవరాల్ గా ఆధిపత్యం మాత్రం రెడ్లకే చెందుతోంది. కాంట్రాక్టులు, పదవుల్లో వారికే లబ్ధి చేకూరుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో కమ్మ సామాజికవర్గం నేతల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అమరావతిలో భూములు కొన్నవారంతా వారేనన్న విమర్శ ఉంది. ఇప్పుడు విశాఖలో అంతా రెడ్లు కొనేసి అక్కడే రాజధాని చేస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ క్రమంలోనే ఏ కులం అధికారంలోకి వస్తే వారిదే ఆధిపత్యం.. బీసీలు, ఇతర సామాజిక వర్గాలు ఆటలో అరటిపండేనని చెప్పక తప్పదు.
*ఆలయాలపై దాడులు వర్సెస్ మత రాజకీయం
అసలు ఒక్క ఏపీలోనే ఇన్ని ఆలయాలపై ఎందుకు దాడి జరుగుతోంది..? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎందుకిలా చేస్తున్నారు..? దీని వెనుక ఎవరున్నారు..? ఇది కాకతాళీయంగా జరుగుతున్న దాడులా..? కావాలని చేస్తున్నరా..? ఏది ఏమైనా ఏపీలో విగ్రహాల ధ్వంసాలు.. ఆలయాలపై దాడులు ఆందోళన కలిగించే అంశాలే. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొదటి దాడి నుంచే పోలీసులు ఎంక్వైరీ సైతం చేస్తున్నారు. కానీ.. ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దీనిపై ఇంకా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేకపోతోంది. ఇక ప్రతిపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేన దీన్ని రచ్చరంబోలా చేసి జగన్ ను విలన్ చేస్తున్నాయి. మత స్వేచ్ఛను ఆయుధంగా చేసుకుంటున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో మత సామరస్యాన్ని కాపాడకుండా దీన్ని రాజకీయం చేసి చలికాచుకుంటున్నాయి. నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా మతపరమైన విశ్వాసాలతో ఆడుకోరు. రాజకీయంగా తనకు నష్టం కలిగిస్తుందని తెలుసు. జగన్ హిందూ ద్వేషి కాదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని సులువుగానే అర్థమవుతోంది. అయితే.. రాష్ట్రంలో ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇలా నిత్యం దాడులు చేస్తున్న వారిని పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది.
ఇలా కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంటగలవడానికి రాజకీయ నేతలు, వ్యవస్థలు, వారి పక్షపాత ధోరణి.. రాజకీయాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఇక్కడి రాజకీయ కంపు గురించే మాట్లాడుతున్నారు తప్పితే రాజకీయ ప్రభ గురించి పల్లెత్తు కూడా వ్యాఖ్యానించడం లేదు. ఇప్పటికైనా మన రాజకీయ నేతలు, వారిని సపోర్టు చేసే వ్యవస్థలు నిక్కచ్చగా నడిచినప్పుడే ఏపీలో ప్రజాస్వామ్యం నాలుగు పాదాలపై నడుస్తుంది. లేదంటే ఇలానే కుట్రలు, కుతంత్రాలతో కుచించుకుపోతుంది..
-నరేశ్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Andhra pradesh is being tarnished by selfish politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com