వెనుకటికి శత్రుదేశాల్లో తమ వేగులను రాజులు పెట్టేవారట.. అక్కడ మన దేశం గురించి ఏ కుట్ర జరిగినా.. యుద్ధానికి వస్తున్నా వారు వెంటనే వర్తమానం పంపేవారు. పావురాల ద్వారానో లేక ఒక రోజు వీలుచూసుకునే ఈ సమాచారం చేరవేసేవారు. కానీ టెక్నాలజీ పుణ్యమా? అని ఇప్పుడు బెడ్ రూంలో మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా బయటకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఎవరికి తెలియని ఓ పెద్ద రహస్యాన్ని ఆ పత్రికాధినేత వారం ముందుగానే ప్రకటించడం చూసి అందరూ ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే బలమైన మీడియాను చేతిలో పెట్టున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ఆర్కే) గత ఆదివారం రాసిన ఎడిటోరియల్ వ్యాసంలో బాంబు పేల్చారు. జగన్ తో విభేదించి షర్మిల బయటకు వస్తున్నారని.. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని సంచలన వ్యాసం రాశాడు. ఈ వ్యాసం వైరల్ కావడంతో స్వయంగా ఇదే షర్మిల ఒక ప్రకటనలో ‘‘తూచ్.. అలాంటిదేమీ లేదని’’ స్వయంగా ఖండించారు. కానీ కట్ చేస్తే.. తాజాగా ఈరోజు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టబోతున్నట్టు హింట్ ఇచ్చారు. కార్యకర్తలతో అందుకే సమావేశం నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. దీన్ని రాధాకృష్ణ చెప్పింది అక్షరసత్యమని చెప్పకతప్పదు.
తెలుగు రాష్ట్రాల్లోనే బలమైన మీడియా ఉండి.., నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఆర్కే ఇలా బాంబులు పేల్చడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏకంగా ఎవ్వరూ చొరబడిన గవర్నర్ ఇంట్లోకి వెళ్లి ఎన్డీ తివారీ రాసలీలలను లైవ్ లో ఇచ్చిన ఘనుడాయన.. చివరకు హైకోర్టు జోక్యం చేసుకొని ఆ ప్రసారాన్ని ఆపమనే దాకా హోరెత్తించాడు.
ఇదే కాదు.. చిరంజీవి రాజకీయాలు చాలనుకొని ప్రజారాజ్యం జెండా పీకేయబోతున్నాడని కూడా ఇదే ఆర్కే తన పత్రికలో రాతలు రాశాడు. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం నేతలు ఆర్కేను తిట్టిపోశారు. కానీ చివరకు ఆర్కే చెప్పిందే నిజమైంది.
నిజానికి మిత్రపక్షం పార్టీల్లో జరిగే లూప్ హోల్స్ ఎలాగూ ఆర్కే కు ముందుగానే తెలుస్తాయి.కానీ వైరిపక్షమైన వైసీపీలో .. ఏపీ సీఎం జగన్ కుటుంబంలో జరిగే వ్యవహారాలను కూడా ముందే పసిగట్టి.. ఆర్కే వారం ముందుగానే చెప్పడం నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఆర్కే చెప్పినట్టే జగన్ ఫొటో లేకుండానే ‘రాజన్న రాజ్యం’ అంటూ షర్మిల కొత్త పార్టీతో తెలంగాణలో ముందుకు సాగుతున్నారు. దీనివెనుక జగన్ ఉన్నాడా? కేసీఆర్ ఉన్నాడా? లేదా మరేదైనా కథ అన్నది ముందుముందు తేలనుంది. మొత్తానికి ఆర్కే తన బలమైన మీడియా నెట్ వర్క్ తో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చీమ చిటుక్కుమన్నా ఇట్టే పసిగడుతుండడం విశేషంగా మారింది..