టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సరికొత్తదారుల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాష్ర్టంలోని టీడీపీ పగ్గాలను కొడుకు లోకేష్ కు అప్పగించి.. తాను ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఢిల్లీకి వెళ్లి.. అక్కడ అమిత్ షాను కలిసి.. ఎన్టీఏ కూటమిలో స్థానం కల్పించాలని చంద్రబాబు అడుగుతారని అనుచరులు చెబుతున్నారు. అమిత్ షా అవకాశం ఇవ్వకుంటే.. కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు అంటున్నారు. అయితే తటస్థ నిర్ణయాలు తీసుకోలేని చంద్రబాబు.. వచ్చేసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలో చేరి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఎవరు అవకాశం ఇస్తే వారి కూటమిలో చంద్రబాబు చేరడానికి రెడీ అయ్యారన్న ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బాబుగారికి ఏమైంది..? ఎందుకు ఇప్పుడు దేశ రాజకీయాల వైపు దృష్టి పెడుతున్నారని అందరూ శూల శోధన చేస్తున్నారు.
Also Read: ఏపీ హైకోర్టు కర్నూలు తరలింపుపై కేంద్రం క్లారిటీ.. ఇక జగన్ కీలకం?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా..? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారా?.. దీనికోసం త్వరలో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అమిత్ షా ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు కొంతమంది బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గుంటూరు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్, కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.. 20 నిమిషాలకు పైగా అమిత్ షాతో సమావేశం అయ్యారు. పితృత్వ సెలవుల్లో ఉన్న కారణంగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీకి వెళ్లలేదు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించడానికే వారు అమిత్ షాను కలిశారని పైకి చెబుతున్నప్పటికీ.. అసలు విషయం వేరేగా ఉందని అంటున్నారు.
Also Read: నాకు భద్రత పెంచండి..: కేంద్రానికి విన్నవించుకున్న రేవంత్
చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలనే ఏకైక కారణంతో వారు అమిత్ షాను కలిశారని తెలుస్తోంది. చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే.. ఇదివరకు ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి దారి తీసిన పరిణామాలు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలపాల్సి వచ్చిందనే విషయాలపై వివరణ ఇస్తారని ఎంపీలు ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించినట్లు చెబుతున్నారు. దీనిపై అమిత్ షా అప్పటికప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. చంద్రబాబును కలవడానికి మాత్రం సుముఖంగానే ఉన్నారని అంటున్నారు.
ఎన్డీఏలో చేరడానికి అమిత్ షా గానీ.. బీజేపీ పెద్దలు గానీ అంగీకరించకపోతే.. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చంద్రబాబు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని తటస్థంగా ఉంచడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదనే వాదనలు ఉన్నాయి. ఎన్డీఏ లేదా యూపీఏ కూటమిలో చేరడం వల్ల టీడీపీకి జాతీయ పార్టీల అండ లభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండింట్లో ఎన్డీఏలో చేరడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశ రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉన్న నేత కావడం, టీడీపీ జాతీయపార్టీగా ఆవిర్భవించిన పరిస్థితుల్లో అదే స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్