దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుందా? హిమాలయాలను దూరం నుంచి చూస్తే ఆహ్లాదంగా కనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అవి అసలు మనుగడకు సాధ్యం కాదు.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా పైకి ఎంతో గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ఆ దేశం చైనా, జపాన్ లకే కాదు.. ఆఖరుకు మన భారత్ కు కూడా ఇంత అప్పు పడిందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
తాజాగా అమెరికా అప్పుల లెక్కను ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ బయటపెట్టాడు. 2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుకు చేరాయని మూనీ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు ఆయన తెలిపారు.
అమెరికా దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికీ పంచితే 10000 డాలర్లు వస్తుందని తెలిపారు. అమెరికాకు మిత్రదేశాలు కానీ చైనా, జపాన్ కే ఎక్కువగా రుణపడి ఉన్నామని చట్టసభ సభ్యుడు వ్యాఖ్యానించారు. ఈ రెండుదేశాల్లో ఒక్కొక్క దానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా రుణపడి ఉందని తెలిపారు.
ఇక భారత్ కు సైతం అమెరికా 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉందని చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ సంచలన ప్రకటన చేశారు. అగ్రరాజ్యం అమెరికా భారత్ కు అప్పు పడిందన్న అన్న వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది. సామాన్య మధ్యతరగతి దేశానికి అమెరికా బాకీ పడడం నిజంగా సంచలన వార్త అయ్యింది.
కొద్ద ఉద్ధీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకోవాలని తోటి చట్టసభ్యులను మూనీ కోరారు. ఈ పథకంలో చాలా వరకు నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లబోవని ఆరోపించారు.