ఓటుకు నోటు మళ్లీ వేగం పుంజుకుంది. ఈ కేసులో కీలకమైన రేవంత్ రెడ్డి అనుచరుడు అరెస్ట్ కావడం రాజకీయంగా సంచలనమైంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఢిల్లీ వెళ్లిరాగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం.. టీడీపీ కోటరీని ఆందోళనకు గురిచేస్తోంది. కొంపదీసి చంద్రబాబును చెక్ పెడుతారా? అన్న టెన్షన్ రాజకీయవర్గాల్లో నెలకొంది.
Also Read: కాంగ్రెస్ కు హ్యండిచ్చి.. బీజేపీలో చేరుతున్న మాజీ మంత్రి..!
తాజాగా ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడిగా ఉన్న ఉదయ్ సింహను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లను కొట్టేసిన ఏసీబీ కోర్టు.. విచారణకు హాజరు కాని ఉదయసింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఇదే కేసులో నిందితులైన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ లు కోర్టుకు హాజరు కావడంతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. గైర్హాజరైన ఉదయసింహ అరెస్ట్ అయ్యారు.
ఈ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. ఇదే కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ సింహా నిందితులుగా నమోదై ఉన్నారు.
Also Read: కేసీఆర్ కు 24 గంటల డెడ్ లైన్ ఇచ్చిన బండి సంజయ్
తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 లక్షలతో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను కొనుగోలు చేసేందుకు వచ్చి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినట్టు.. చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు వీడియోలు, ఆడియోలు వైరల్ కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అయితే కేసీఆర్ ను కలిసి చంద్రబాబు నాడు స్నేహగీతం ఆలపించడంతో ఈ కేసు అతీగతీ లేకుండా పోయింది. ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. కానీ ఇప్పుడు సడెన్ గా ఒక అరెస్ట్ చోటుచేసుకోవడంతో రాజకీయంగా సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్