
తెలుగు రాష్ట్రాల రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖపట్నంలోని అరకులో ప్రైవేటు బస్సు బోల్తా పడి పలువురు చనిపోయిన విషాదం ఇంకా వీడకముందే మరో భారీ ప్రమాదం విషాదం నింపింది. తాజాగా కర్నూలు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఇక తెలంగాణలోనూ మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో 17మంది గాయపడగా.. నలుగురు సీరియస్ గా ఉన్నారు. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ వద్ద మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు బోల్తాపడడంతో 17మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అతివేగమే కారణమని తేల్చారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కూడా కారణమంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తాపడిందంటున్నారు.
ఇక కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దైవదర్శనానికి వెళ్తున్న 14 మంది రోడ్డు ప్రమాదంలో అసువులు బాసారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్ పురం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8మంది మహిళలు, ఐదుగురు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు చిన్నారుల తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 18మంది ఈ టెంపోలో ఉన్నారు. క్షతగాత్రులను కర్నూలు ఆష్పత్రికి తరలించారు.
బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తేల్చారు.