
ఇంగ్లండ్ తో కీలకమైన 4వ టెస్టుకు టీమిండియా రెడీ అయ్యింది. ఈ టెస్టులో గెలిస్తే టీమిండియా నేరుగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధిస్తుంది. అందుకే ఎలాగైనా ఇంగ్లండ్ ను ఓడించాలని.. లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
టీమిండియా ఇంగ్లండ్ తో మ్యాచ్ లో గెలిచినా.. డ్రా చేసుకున్నా ప్రపంచటెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధిస్తుంది. ఇంగ్లండ్ తో జరిగే చివరి టెస్టు ఈరోజు ఉదయం 9.30 నుంచి ప్రారంభం కానుంది..
మూడో టెస్టు మొతేరా పిచ్ పై రెండో రోజే ముగియడం.. స్పిన్నర్లు తిప్పేయడంతో ఈ పిచ్ పై చర్చ జరిగింది. పిచ్ చెత్త అని అందరూ విమర్శించారు. అయినా కూడా భారత్ ఆ విమర్శలను తిప్పి కొట్టి విదేశాల్లోని పిచ్ లను గుర్తు చేసింది.
ఈ క్రమంలోనే నాలుగో టెస్టుకు సైతం స్పిన్ పిచ్ నే భారత్ తయారు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కూడా స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. డే మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ రెండు రోజుల్లో ముగియదు. కనీసం మూడు నాలుగు రోజులు సాగుతుంది.
ఒక వేళ టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడితే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అనూహ్యంగా అర్హత సాధిస్తుంది.. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్ కు చేరింది. జూన్ లో లార్డ్ వేదికగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ జరుగనుంది. అయితే ఇంగ్లండ్ పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్ లో అడుగు పెట్టాలని కోహ్లీ సేన కోరుకుంటోంది.
కీలకమైన నాలుగో టెస్టులోనూ స్పిన్ పిచ్ నే భారత్ సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. కానీ ఈసారి పరుగులు చేయడం కష్టం కాకుండా తీర్చిదిద్దినట్లు సమాచారం.
భారత్ ఆఖరి టెస్టుకు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. బుమ్రా వ్యక్తిగత కారణాలతో టీం నుంచి వైదొలగడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటోంది. మరోసారి భారత్ ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది. సుందర్ఈ మ్యాచ్ లోనూ ఆడనున్నాడు.