జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో కురిసిన అకాల వర్షాలతో నగరం ముంపునకు గురైంది. కొన్నిరోజులపాటు నగరం వరదల్లో ఉండటంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రభుత్వం సహాయ చర్యలతోపాటు వరదసాయం ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు హడావుడిగా కొన్ని డివిజన్లలో ప్రభుత్వం 10వేల సాయం అందించింది. అయితే ఎన్నికల సమయంలో డబ్బులు అందించడంపై ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వరద సాయం నిలిచిపోయింది.
టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఫలితాలతో సంబంధం లేకుండా డిసెంబర్ 7నుంచి బాధితులందరికీ వరదసాయం ప్రకటిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెల్సిందే.
దీంతో బాధితులంతా డిసెంబర్ 7న మీ సేవా కేంద్రాలకు వద్ద బారులు తీరారు. వరదసాయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందిస్తూ బాధితులెవరూ మీసేవా కేంద్రాలకు రావద్దని.. నగదును వారి అకౌంట్లలోనే జమ చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే దీనిపై బాధితులు నిరసన వ్యక్తం చేస్తూ కార్పొరేటర్లు.. ఎమ్మెల్సీలు.. సీఎం క్యాంప్ ఆఫీసు కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేశారు. ఈ సమయంలో వరద సాయంపై బాధితులంతా అనుమానాలు వ్యక్తం చేశారు.
నిజమైన బాధితులకు వరదసాయం అందలేదని.. సెకండ్ ఫ్లోర్లలో ఉండేవారికి.. టీఆర్ఎస్ నాయకులు చెప్పిన వాళ్లకే సాయం అందిందంటూ ఆరోపణలు గుప్పించారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్లో వచ్చిన వరదలతో ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.. ఎన్ని కుటుంబాలకు సాయం అందించారు.. అన్న వివరాలను మాత్రం జీహెచ్ఎంసీ దగ్గర లేకపోవడం గమనార్హం.
‘సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ ది పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్’ అనే సంస్థ సమాచార హక్కు చట్టం కింద.. ఏయే వార్డులో ఎంత మంది వరద ముంపునకు గురయ్యారు.. ఆ కుటుంబాలను ఎలా గుర్తించారు.. ఏ ప్రాతిపదికన సాయం అందించారు.. ఇంకా వార్డుల వారీగా ఎంతమందికి అందాల్సి ఉందో చెప్పాలని జీహెచ్ఎంసీని కోరింది.
అయితే దీనికి జీహెచ్ఎంసీ చీఫ్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ తమ వద్ద వివరాలను లేవని వెల్లడించారు. సర్వే వివరాలు.. నిపుణుల నివేదిక.. అంచనా నష్టం వివరాలు తమ దగ్గర లేవని.. బాధితులను గుర్తించడానికి అవలంబించే ప్రామాణికాలుగానీ తమ దగ్గర లేవని పేర్కొన్నారు.
దీంతో వరద సాయంపై బాధితులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. ఆర్టీఐ దరఖాస్తుకు కూడా జీహెచ్ఎంసీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వరదసాయం పక్కదారి పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!