Work From Home: అంతర్జాతీయ సంక్షోభం, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బంగారం కొనుగోలు తగ్గించాలని.. ఇంధన పొదుపు చేయాలని చెప్పడం తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని పునఃసమీక్షించాలని, దీనివల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఐటీ రంగంలో కొత్త కదలిక మొదలైంది. కొన్ని ఐటీ కంపెనీలు తమ పని విధానాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం ను కేటాయించాలని నిర్ణయించుకుంటున్నాయి.
ప్రధాని పిలుపునకు మద్దతుగా భారత ఐటీ ఉద్యోగుల సంఘం (NITES) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక విన్నపం చేసింది. దేశంలోని దాదాపు 58 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ విధానం వల్ల ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) మెరుగుపడటమే కాకుండా, మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇటీవల తమ సంస్థ పూర్తిగా ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ విధానానికి మారిందని పేర్కొన్న ఆయన, ప్రధాని సూచనల నేపథ్యంలో మళ్ళీ WFH విధానాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగులకు వెసులుబాటు కలగడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
WFH విధానాన్ని ప్రోత్సహించడం వెనుక బలమైన కారణం పర్యావరణ కూడా ఉంది. ఉద్యోగులు ఆఫీసులకు రానవసరం లేకపోతే వాహనాల వాడకం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి కర్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఇది దేశ ఇంధన భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. అది ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం, కంపెనీల స్పందన ఆధారంగా రానున్న రోజుల్లో ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.