Homeలైఫ్ స్టైల్Woman budget planning viral video: జీతం రూ.90వేలు.. ఖర్చు రూ.25 వేల లోపే.. ఈమె...

Woman budget planning viral video: జీతం రూ.90వేలు.. ఖర్చు రూ.25 వేల లోపే.. ఈమె బడ్జెట్ ప్లాన్ కు నెటిజన్ల ఫిదా..: వీడియో వైరల్

Woman budget planning viral video: ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య పెద్ద నగరాల్లో ఉద్యోగం చేస్తూ డబ్బు ఆదా చేయడం చాలామందికి సవాల్‌గా మారింది. ముఖ్యంగా దిల్లీ వంటి మెట్రో నగరాల్లో అద్దె, ఆహారం, ప్రయాణం వంటి ఖర్చులు భారీగా ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన తరణంలో పెట్రోల్ తో పాట కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సూచనలను కొందరు పట్టించుకోవడం లేదు. కానీ ఓ గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రం తన బడ్జెట్ ప్లాన్ తో ఖర్చులు బాగా తగ్గించుకొని భారీగా డబ్బును సేవ్ చేస్తోంది. ఈ సమాచారాన్ని ఆమె తన ఇన్ స్ట్రాగ్రామ్ వీడియో ద్వారా తెలిపింది. ఆ వివరాలు మీకోసం..

కేంద్ర సచివాలయంలో అసిస్టెంట్ కృతిక అనే అమ్మాయి సెక్షన్ ఆఫీసర్ (ASO)గా పనిచేస్తున్నారు. SSC CGLపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఈమె ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కృతిక తన ఆర్థిక నిర్వహణతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నెలకు ఆమెకు రూ.90,000 ఇన్ హ్యాండ్ శాలరీ వస్తుంది. ఆమె ఇందులో కేవలం రూ.25,000 లోపే ఖర్చులను చేస్తూ మిగతా సొమ్మును ఆదా చేస్తున్నారు.

దిల్లీలో ఒంటరిగా ఒక ఫ్లాట్ తీసుకుంటే నెలకు భారీగా అద్దె చెల్లించాల్సి వస్తుందని కృతిక ముందుగానే అంచనా వేశారు. దీంతో ఆమె ఒక ఫ్లాట్‌మేట్‌తో కలిసి రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ను షేర్ చేసుకోవాలని నిర్ణయించారు. దీంతో మొత్తం అద్దెను ఇద్దరూ పంచుకోవడం వల్ల ఆమె వాటా కింద కేవలం రూ.11,500 మాత్రమే ఖర్చవుతోంది. మెట్రో నగరాల్లో నివాస ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది ఉత్తమ మార్గమని ఆమె చెబుతున్నారు.

చాలామంది ఉద్యోగులు సమయం లేక బయట ఆహారంపైనే ఆధారపడుతుంటారు. కానీ కృతిక మాత్రం ఆరోగ్యాన్ని, డబ్బును రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటి వంటకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం నెలకు రూ.5,000 జీతంతో ఒక వంటమనిషిని నియమించుకున్నారు. ఆ ఖర్చును కూడా ఫ్లాట్‌మేట్‌తో పంచుకోవడం వల్ల ఆమెపై పడే భారం కేవలం రూ.2,500 మాత్రమే. దీంతో ప్రతిరోజూ రుచికరమైన ఇంటి భోజనం తక్కువ ఖర్చుతో అందుతోంది.

నేటి యువతలో జోమాటో, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారా తరచూ ఆహారం ఆర్డర్ చేసే అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కానీ కృతిక ఆ ఖర్చులను కట్టడి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇంటి భోజనం అందుబాటులో ఉండటంతో బయట ఆహారం అవసరం చాలా తక్కువగా వస్తుంది. ఫలితంగా ఆమె నెలవారీ ఫుడ్ డెలివరీ ఖర్చులు రూ.2,000 లోపే ఉంటున్నాయి.

కృతిక జీవనశైలిలో మరో ముఖ్యమైన అంశం అవసరం లేని ఖర్చులను పూర్తిగా నివారించడం. ఖరీదైన బ్రాండ్లు, తరచూ షాపింగ్, విలాసవంతమైన వినోదాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా, అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతోందో లెక్కపెట్టే అలవాటు ఆమెకు ఉంది.

నెలకు రూ.90,000 జీతం వస్తుండగా, ఖర్చులు రూ.25,000 లోపే ఉండటంతో మిగిలిన మొత్తాన్ని కృతిక పొదుపులు, పెట్టుబడుల కోసం వినియోగిస్తున్నారు. అత్యవసర నిధి, మ్యూచువల్ ఫండ్లు, భవిష్యత్ లక్ష్యాల కోసం ప్రత్యేకంగా డబ్బును కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమశిక్షణే ఆమె ఆర్థిక భద్రతకు బలమైన పునాదిగా మారింది.

ఎక్కువ సంపాదించడం మాత్రమే కాకుండా, సంపాదించిన డబ్బును ఎలా నిర్వహించుకోవాలో కృతిక కథ స్పష్టంగా చూపిస్తోంది. సరైన ప్రణాళిక, అవసరాలకు మాత్రమే ఖర్చు చేయడం, పొదుపులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మెట్రో నగరంలోనూ ఆర్థికంగా బలంగా నిలవవచ్చని ఆమె నిరూపించారు. యువ ఉద్యోగులకు ఆమె బడ్జెట్ ప్లానింగ్ ఒక మంచి మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version