Wildlife In Sikkim: సాధారణంగా అటవీ జంతువులు జనారణ్యంలోనే సంచరించవు. జనాల తాకిడి ఏ మాత్రం ఉన్నా అక్కడి నుంచి పరుగులు తీస్తాయి. లేకుంటే భయంతో దాడి చేస్తాయి. కానీ అక్కడ మాత్రం పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా కనిపిస్తుంటాయి. సముద్ర తీర ప్రాంతంలో సందర్శకుల వలే సంచరిస్తుంటాయి. రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల మధ్య తిరుగుతుంటాయి. మార్కెట్ లోకి సంచరిస్తాయి. హోటళ్లూ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోకి ప్రవేశిస్తుంటాయి. వింతగా ఉంది కదూ నిజమేనండీ. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఎలుగుబంట్లు అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో వీటి సంచారం అధికమైంది.మొన్నటికి మొన్న నిత్యం వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే పలాస రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపైకి వచ్చిన ఒక ఎలుగుబంటి చాలా సేపు హల్ చల్ చేసింది. అన్ని ప్లాట్ ఫారంలపై సంచరించింది. ప్రయాణికులు భయాందోళనకు గురికాగా.. సర్కస్ మాదిరిగా అటు ఇటు కలియతిరిగిన భల్లూకాన్ని తమ సెల్ ఫోన్లో బంధించారు. కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ప్రధానమైన బీచ్ ల్లో సైతం ఎలుగుబంట్ల గుంపు సంచరిస్తూ కనువిందు చేసింది. గుడులు, గోపురాలను సైతం ఎలుగుబంట్లు విడిచిపెట్టడం లేదు. లోపలికి ప్రవేశించి భక్తులు పెట్టిన ప్రసాదం, పండ్లును ఆరగిస్తున్నాయి. నూనె, నెయ్యిని తాగుతున్నాయి. ఉద్దానంలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోకి ప్రవేశిస్తున్నాయి. అక్కడున్న ఆహార పదార్థాలు, నూనె, ఇతర వ్యర్థాలను తింటున్నాయి. వేకువజామున వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి వచ్చేవారిని అటకాయిస్తున్నాయి.
విపత్తులతో అడవులు నాశనం
జింకలు, చుక్కల దుప్పిలు, అడవి పందుల సందడి అంతా ఇంతా కాదు. పదుల సంఖ్యలో చంగుచంగున పరుగెడుతూ కనువిందు చేస్తున్నాయి. రహదారులు, రైల్వే ట్రాకులు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటడం, అటవీ ప్రాంతంలో నీరు లేకపోవడంతో మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. దారి మళ్లి బయటకు వచ్చి వేటగాళ్లకు చిక్కుతున్నాయి. ఉద్దానంలో జీడి, మైదాన ప్రాంతాల్లో వేరుసెనగ, ఇతర పంటలను నాశనం చేస్తున్నాయి. జిల్లాలో అటవీ, కొండ ప్రాంతం ఎక్కువ. సువిశాలమైన ఏజెన్సీ ప్రాంతం ఉంది. అటు ఉద్దానంలో లక్షలాది కొబ్బరి, జీడి చెట్లు ఉన్నాయి. వీటిలో వేలాదిగా వన్య ప్రాణులు తలదాచుకునేవి. కానీ హుద్ హుద్, తితలీ తుపానుతో అటవీ ప్రాంతం నాశనమైంది. చెట్లు నెలకొరిగాయి. మరోవైపు అటవీ భూములు ఆక్రమణలకు గురికావడం, రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. దీంతో వన్య ప్రాణులు తలదాచుకునేందుకు చోటు లేక బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాయి. ఎలుగుబంట్లు, చుక్కల దుప్పిలు, జింకలు జనారణ్యంలోకి వస్తున్నాయి. వాటిని సంరక్షించాల్సిన అటవీ శాఖ పత్తా లేకుండా పోయింది. దీంతో అటు వేటగాళ్లు, ఇటు ప్రమాదాలతో వన్యప్రాణులు తగ్గుముఖం పడుతున్నాయి. వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Web Title: Wildlife in the human world in sikkim
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com