Electric Two Wheelers: ద్విచక్ర వాహనాల్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతోంది. దీంతో కంపెనీలు వివిధ మోడళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. అదే సమయంలో రేట్లు భారీగా పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రధాన కంపెనీలు వివిధ మోడళ్ల ధరలను పెంచాయి. ఇతర కంపెనీలు వీటిని అనుసరిస్తున్నాయి. ఫేమ్–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీకి భారీ పరిశ్రమల శాఖ కోత విధించడమే మోడళ్లు ఖరీదవడానికి కారణం. భారత్‌లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం పెరిగేందుకు 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) పథకం దేశీ ఈవీ రంగానికి బూస్ట్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని అకస్మాత్తుగా తగ్గించడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణతకు దారితీయవచ్చని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఎస్‌ఎంఈవీ) హెచ్చరించింది.
సబ్సిడీ తగ్గింపు ఇలా..
2023, జూన్ 1 లేదా ఆ తర్వాత రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఫేమ్–2 పథకం కింద సబ్సిడీని తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కిలోవాట్ అవర్‌కు గతంలో ఇచ్చిన రూ.15 వేల సబ్సిడీ కాస్తా ఇక నుంచి రూ.10 వేలకు తగ్గుతుంది. ప్రోత్సాహకాలపై పరిమితి ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గతంలో ఉన్న 40 శాతం నుంచి 15 శాతానికి కుదించారు. రానున్న రోజుల్లో పరిశ్రమ వాస్తవిక వృద్ధి చూస్తుందని బజాజ్ అర్బనైట్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
భారీగా అమ్మకాలు..
ఇదిలా ఉంటే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. రేట్లు పెరుగుతున్నా కొనేవారు వెనుకడుగు వేయడం లేదు. పెట్రో ధరల పెంపు కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. 2023, మే నెలలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 1,04,755 యూనిట్లు రోడ్డెక్కాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయన్న నేపథ్యం కూడా ఈ విక్రయాల జోరుకు కారణమైంది. ఓలా, టీవీఎస్, ఏథర్, బజాజ్, ఆంపియర్ టాప్–5లో నిలిచాయి.
అమ్మకాల వేగం తగ్గే చాన్స్..
ప్రభుత్వ చర్యతో ఈ–టూ వీలర్ల అమ్మకాల వేగానికి కళ్లెం పడుతుందని ఎస్‌ఎంఈవీ తెలిపింది. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, ఈ–టూవీలర్ల మధ్య ధర వ్యత్యాసం అమాంతం పెరుగుతుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈవీల జోరు పెరిగే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతివ్వాలని అవేరా ఏఐ మొబిలిటీ ఫౌండర్ రమణ కోరారు.
కస్టమర్లు సన్నద్ధంగా లేరు..
భారత్‌లో ధర సున్నితమైన అంశం అని ఎస్‌ఎంఈవీ ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు. ‘పెట్రోలుతో నడిచే ద్విచక్ర వాహనాల్లో అధిక భాగం మోడళ్లు రూ.లక్ష కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఈవీ కోసం రూ.1.5 లక్షలకుపైగా ఖర్చు చేసే అవకాశాలు చాలా తక్కువ. మార్కెట్ వృద్ధి చెందే వరకు సబ్సిడీలు కొనసాగించాల్సిందే. భారత్‌లో మొత్తం ద్విచక్ర వాహనాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4.9 శాతమే. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ప్రకారం ఇది 20 శాతానికి చేరుకోవడానికి రాయితీలు ఇవ్వాలి’ అని సూచించారు.