Temple Bell: హిందూ దేవాలయాల్లో గంట అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. గంట కొట్టకుండా దర్శనం చేసుకోరు భక్తులు. హారతి ఇస్తున్నప్పుడు, నైవేద్యం పెడుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు దేవుడికి గంట కొట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకీ గంట ఎందుకు కొడుతారు? గంట కొట్టడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
దేవుడి ముందు ఉన్న గంట కొట్టడం వల్ల కొంత దూరంలో ఉన్న దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుందట. అంతే కాదు కోరికలు కోరుకొని గంట కొడితే భగవంతుడికి చేరుతుందని నమ్ముతుంటారు భక్తులు. ఇక గంట మోగితే అన్ని శుభాలకు సంకేతం అంటారు. ఇక ఇంట్లో కూడా గంటలను మోగించడం వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుందని, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది అంటారు పండితులు.
ఆలయంలో ఉన్న గంటను 3 లేదా 5 సార్లు కొడితే శరీరంలో ఉండే నరాలు ఉత్తేజితం అవుతాయి. మెదడులోని కుడి, ఎడమ భాగాలు కూడా కొంచెం సమయం వరకు ఏకం అవుతాయి. దీంతో మనసుకు ప్రశాంతత కలుగుతుందట. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది అంటారు పండితులు. గంటను మోగించడం వల్ల గాలిలో ఉండే క్రిములు కూడా నశించిపోతాయి అని నమ్మకం. ఇక హారతి సమయంలో కూడా గంట కొడుతుంటారు. దేవతలందరికి ఆహ్వానం అందిచడానికి ఈ గంటను కొడుతారట.
కంచుతో తయారు చేసిన గంటను కొడితే ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం వినిపిస్తే మనిషిలో ఉన్న సమస్యలు, చింతలు తొలిగిపోతాయి అనే నమ్మకం కూడా ఉంది. అంతేకాదు మనసు దేవుడిపై మళ్లేలా చేస్తుందట. కొన్ని ఆలయాల్లో గుత్తులు గుత్తులుగా ఉంచుతారు. కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు పండితులు. కేవలం అలంకారానికి మాత్రమే కడుతారట.