Self Deprecating: నా పుట్టకనే ఒక వ్యర్థం, నా బతుకు వేస్టే, నేను ఏం సాధించలేను, నా వల్ల కాదు అనే ఆలోచనలు మీలో ఉన్నాయా? అయితే ఈ ఆత్మన్యూనతో బాధ పడేవారు ఎప్పుడు కూడా నిజంగా ఏది సాధించలేరు. మీరు ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే వీటిని వదిలిపెట్టాలి. అవి వదిలిపెట్టేవరకు మీ జీవితం నరకంగానే ఉంటుంది.
ఈ ఆత్మన్యూనత 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుందట. ఇదొక రకంగా చెప్పాలంటే మానసిక వ్యాధి. దీనికి ఔషధం కూడా ఉండదు. మీరు మారడం తప్ప. నేను తక్కువ కాదు, నేను కూడా ఏదైనా సాధిస్తాను, నాలో ఎలాంటి లోపం లేదు, అందరితో సమానంగా పనిచేయగలను, సాధించగలను అని నమ్మినప్పుడు మాత్రమే మీలో ఉన్న ఆత్మన్యూనతకు చికిత్స లభిస్తుంది. అయితే వీరిని భరించడం చాలా కష్టం. ఎంత సర్దిచెప్పినా మళ్లీ అదే రాగం ఎత్తుకుంటారు.
పరిస్థితులకు రాజీపడి బతుకుతుంటారు. ఒకసారి పుట్టామంటే ఏదో ఒకటి సాధించాలి. లేదంటే సాధించేలా కృషి చేయాలి. అప్పుడే మన జీవితానికి అర్థం. ఇక ఈ ఆత్మన్యూనత అతిథి లాగా వచ్చి పోదు. వస్తుంది నిత్యం అలాగే ఉంటుంది. ఎవరైన మోటివేట్ చేస్తే కాస్త దూరం వెళ్లినట్టే వెళ్లి తిరిగి మళ్లీ వస్తుంది. అందుకే ఈ ఆత్మన్యూనతకు మీరే డాక్టర్ అవ్వండి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు.
ఆత్మన్యూనత పోవాలంటే మిమ్మల్ని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల మీకే ఒక అవగాహన, అంకిత భావం ఉండాలి. అప్పుడే మిమ్మల్ని ఎదుటివారు ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అయినా మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఇతరులు ఎలా నమ్ముతారు? ఒకసారి ఇది ఆలోచించండి. మీకు కూడా అందరిలాగా ముందుకు వెళ్లాలి అనిపిస్తే మీలో ఉన్న భయాన్ని, పిచ్చి పిచ్చి ఆలోచనలను పక్కకు పెట్టండి. ధైర్యాన్ని నింపుకోండి.