Sankranti Haridas: ధనుర్మాసం మొదలైంది అంటే చాలు… హరిదాసులు ఊళ్లల్లో సందడి చేస్తారు. ఇంటింటికి తిరిగి భిక్ష సేకరిస్తారు. ” హరిలో రంగ హరి” అంటూ పాటలు పాడుతారు.. వాస్తవానికి వారు ధనుర్మాస అతిథులు.. తెల్లవారుతూనే తెలుగు లోగిళ్ళను మేల్కొలుపుతారు. తంబుర మీటుతూ చిడతలు వాయిస్తూ హరి నామ సంకీర్తనలతో వీనుల విందు చేస్తారు. శ్రీ మహా విష్ణువు ప్రతిరూపాలుగా చెప్పుకుంటూ హరికథలు వినిపిస్తారు. సంక్రాంతి పండుగను నెల ముందుగానే గుర్తు చేస్తూ… సంప్రదాయాలను ముందు తరాలకు అందిస్తారు.. గుమ్మం ముందుకు వచ్చినప్పుడు మనం గుప్పెడు బియ్యం గింజలు సమర్పించాలి. సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనిపిస్తారు. మళ్లీ ఏడాది దాకా రారు.

హరిదాసు అంటే పరమాత్మతో సమానం..
హరిదాసులు పెద్ద పండుగకు వస్తారు.. భోగి, సంక్రాంతి, మూడు రోజులు జరుపుకుంటారు కాబట్టే దీనిని పెద్ద పండుగ అని పిలుస్తారు..అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం.. యోగనిద్ర నుంచి మహావిష్ణువు మేల్కొని భక్తుల మొరలు ఆలకించే సమయం.. ఇక హరిదాసులను శ్రీమహావిష్ణువు ప్రతిరూపాలుగా పిలుస్తారు.. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనకు తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి.. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని హరిదాసులు దీవిస్తారు.. నెల రోజులపాటు హరి నామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు.. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయపాత్ర వారి శిరస్సు పై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయపాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.

హరిదాసులు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు.. అక్షయపాత్రను దించరు.. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయపాత్రను దించుతుంది.. ఇక గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామస్మరణ చేసే వారిని అనుగ్రహించేందుకు హరిదాసు రూపం “వైకుంఠపురం” నుంచి శ్రీమహావిష్ణువు వస్తాడు అనేది ఒక నమ్మకం. హరిదాసు పేద, వేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు.. ఎవరి ఇంటి ముందూ ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరి అంటూ ఇంటిముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు.. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరి దాసు ఉట్టి చేతులతో వెళ్లిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు.. అందుకే గ్రామాల్లో హరిదాసుడు వస్తున్నాడు అంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు.. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.. హరిదాసు తల మీద గుంటటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయపాత్రలో బియ్యం పొయ్యాలని పెద్దల మాట.
అవినాభావ సంబంధం
హరిదాసు కీర్తనలు, సంక్రాంతి సంబరాలు.. ఈ రెండింటికి మధ్య ఎంతో సంబంధం ఉంది. సంక్రాంతి పండగ రోజు ఒక చేతిలో చిడతలు, మరో చేతిలో తంబురా, నుదుటన మూడు నామాలు, తలపై అక్షయపాత్ర పెట్టుకొని సంక్రాంతి రోజున కనిపిస్తారు హరిదాసులు.. హరిలో రంగ హరి అంటూ విష్ణు కీర్తనలు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. భక్తి ఉద్యమం వల్ల దక్షిణ భారతంలో వచ్చిన గొప్ప కళా సంపద హరిదాసగానం.. ఇది ఇంచుమించుగా విజయనగర క్షత్రియ రాజుల కాలం నుంచి ప్రచారాన్ని పొందింది.. ఆల్వార్లు, నాయనార్లు సంప్రదాయానికి పునాదులు వేశారు. అదే నేటికీ కొనసాగుతూ వస్తోంది.