Virat Kohli Arrest: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన మైదానంలో అడుగుపెట్టాడంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం . ఆయనపై ఉన్న అభిమానం ఎంతంటే ప్రాణాలు తీసుకునేంత.. కాదు..కాదు.. ప్రాణాలు తీసేంత అని.. ఓ అభిమాని నిరూపించాడు. తన హీరో గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని ఏకంగా సొంత స్నేహితుడి ప్రాణాలే తీశాడు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే దేశంలో కోహ్లి ఫ్యాన్స్ అంతా ఇలాగే ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. అంతేకాకుండా ఫ్యాన్స్ చేష్టలకు విరాట్ బాధ్యత వహించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో #ArrestKohli అనే హ్యాష్ ట్యాగ్ తో విరాట్ కోహ్లిని జైలుకు పంపించాలి అంటూ పోస్టులు పెడుతున్నారు.

క్రికెట్ అంటే కొందరికి ఇష్టం.. మరికొందరికి పిచ్చి.. ఇంకొందరికి ప్రాణం. అలాగే క్రికెట్ ఆడే వాళ్లలో కొందరంటే క్రీడాభిమానులు పడిచస్తారు. తమ క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెడితే చాలు.. ఎన్ని పనులున్నా పక్కనబెట్టేస్తారు. అలాంటి వాళ్లలో ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు ఉన్నారు. వీరిలో విరాట్ కోహ్లి.. కోసం కొందరు ప్రాణాలు తీసుకునేవారున్నారు..! ఇందులో భాగంగా ఆయన పేరు నిత్యం సోషల్ మీడియాలో మారుమోగుతుంది. భారత జట్టుకు అనేక రికార్డులు అందించిన ఆయన ఇప్పుడు టీంలో సభ్యుడుగా మాత్రమే ఉన్నా ఆయనపై కొందరికీ ఇప్పటికీ అభిమానం కొనసాగుతూనే ఉంది.
ఈక్రమంలో పీకల్లోతూ అభిమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయాడు. ఏకంగా ప్రాణ మిత్రుడినే నరికి చంపేశాడు. తన క్రికెట్ హీరో ముందు ఎవరైనా తక్కవే అన్నట్లుగా ప్రవర్తించాడు. తమిళనాడులో ఇటీవల ఇద్దరు స్నేహితులు విఘ్నేశ్, ధర్మరాజ్ లు మద్యం మత్తులో ఉండగా క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు. ధర్మరాజు విరాట్ ఫ్యాన్ కాగా.. విఘ్నేశ్ రోహిత్ ఫ్యాన్. అయితే విఘ్నేశ్ ఆర్సీబీ, కోహ్లిపై ధూషణలు చేశాడు. ఇది సహించలేని ధర్మరాజు తన స్నేహిడుడు విఘ్నేశ్ ను కత్తితో నరికాడు. ఆ తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

గత గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటనతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కోహ్లి ఫ్యాన్స్ అంతా ఇలా నరికి చంపేవాళ్లేనని రోహిత్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు విరాట్ ఫ్యాన్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. తమ క్రీడాకారుడిని ధూషిస్తే ఊరుకుంటారా..? అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా క్రికెట్ వార్ సాగుతోంది.
విరాట్ కోహ్లి గతంలోనూ ఎన్నో వివాదాల సుడిగుండలో చిక్కుకున్నారు. టీ20 వరల్డ్ కప్ విషయంలో కెహ్లి కెప్టెన్సీ సరిగా లేదని విమర్శలు వచ్చాయి. ఆ తరువాత కూడా కొన్ని సీరీస్ లు ఆడిన కోహ్లీపై విమర్శల పరంపర సాగాయి. ఈ నేపథ్యంలో తానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం టీంలో కొనసాగుతున్నా ఆయన గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయంపై క్రికెట్ అధికారులు ఏవిధంగా స్పందిస్తారోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.