Unstoppable 2 With NBK- Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చ 1995 టీడీపీ సంక్షోభం. ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి టీడీపీని హస్తగతం చేసుకున్న రోజులవి. నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్ ను పదవివిచ్యుతుడ్ని చేశారు.అక్కడకు కొద్దిరోజులకే ఎన్టీఆర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అటు తరువాత చంద్రబాబు ప్రజామోదం పొందినా తనపై వచ్చిన అపవాదును చెరిపేసే ప్రయత్నం చేసినా చెరగలేదు. చాలా వేదికల్లో నాడు ఎందుకు అలా చేయాల్సివచ్చిందో చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేసినా అదివర్కవుట్ కాలేదు. ఇప్పుడు బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ద్వారా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు. తన మనసులోని బాధను బయటకు వ్యక్తపరిచారు. నాటి ఘటనలను గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రధానంగా 1995 సంక్షోభాన్ని బాలక్రిష్ణ గుర్తుచేశారు. ‘మీ జీవితంలో అతిపెద్ద వెలితి. తప్పులేమైనా చేశారా బావ’ అని బాలక్రిష్ణ అడిగేటప్పుడు చంద్రబాబు బాధతో స్పందించారు. చటుక్కున 1995 సంక్షోభం అంటూ చెప్పేశారు. నాడు మనం తీసుకున్న నిర్ణయం తప్పా బాలయ్య అని చంద్రబాబు అడిగారు. నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ… ‘1995లో మనం తీసుకున్న నిర్ణయం కీలకమైనది. మన కుటుంబంలో కొన్ని సమస్యలు చోటుచేసుకున్నాయి. అప్పటికి ఎన్నికలు జరిగి ఆరు నెలలే అవుతోంది. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేలా ఉన్నారు. మనం (బాలక్రిష్ణ, హరిక్రిష్ణ) పెద్దాయనను కలవడానికి వెళ్లాం. అక్కడ బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు. మీతో మాట్లాడాలి అంటే పెద్దాయన దేని గురించి అని అడిగారు. కుటుంబం గురించా? ఇంకేదైనా? అని ప్రశ్నించారు. రాజకీయం గురించి అని చెప్పా. అప్పుడు మీ ఇద్దర్ని బయటకు పంపించారు. సుమారు 3 గంటల పాటు అతడితో చర్చించాను. ఒప్పించే ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటుచేయాలని కోరాను. కాళ్లు పట్టుకున్నాను. అదో రామాంజనేయ యుద్ధం ఎపిసోడల్ లా సాగింది. నాడు మనం తీసుకున్న నిర్ణయం తప్పా’ అని బాలక్రిష్ణను చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడు కాదనలేని బాలక్రిష్ణ సమాధానం ఇచ్చారు. టీడీపీ సంక్షోభంపై చంద్రబాబు పూర్తి క్లారిటీతో మాట్లాడారు.

2004లో ముందస్తు ఎన్నికలపై కూడా చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలతో మనతో పాటు మనల్ని నమ్ముకున్న వారిని సైతం ఇబ్బందులకు గురిచేస్తాయని నాటి పరిణామాలను చెప్పుకొచ్చారు. నాడు అలిపిరిలో నక్సలైట్ల దాడితో ప్రభుత్వాన్ని డిశాల్వ్ చేశా. అయితే ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. నన్ను చూసి కేంద్రంలోని వాజ్ పేయ్, కర్నాటకలో ఎస్ఎం క్రిష్ణ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ లను డిశాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్లాం. కానీ ఒక్క నవీనే గెలుపొందారు. మిగతా ముగ్గురు ఓటమి చవిచూశాం. మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయని నాడు అనిపించింది. ఆ ఎన్నికల్లో గెలుపొంది ఉంటే ఏపీ పొజిషన్ మరోలా ఉండేది.