5G Services: వినియోదారులను ఊరిస్తున్న ఐదో తరం టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ అక్టోబర్ ఒకటి నుంచి ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభిస్తారు. జియో, ఎయిర్టెల్ మాత్రమే ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియాకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 5జీ సేవలను మెట్రో నగరవాసులు మొదటిగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం మేం వాడుతున్న 4జీ ఫోన్లు 5 జీని సపోర్ట్ చేస్తాయా? లేక కొత్త ఫోన్ తీసుకోవాలా? కొత్త సిమ్ కార్డ్ అవసరం అవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినియోగదారుల మదిలో మెదలుతుంటాయి. వాటిని ఈ కథనం ద్వారా మేము వృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం.

5జీ అవసరమా
అంటే ప్రస్తుత టెక్ యుగానికి 5జీ అవసరమా? అంటే ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపైనే ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ తో హై గ్రాఫిక్స్ గేమ్స్ ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ నెమ్మది అవుతుందేమోనన్న బాధ లేకుండా పలు ఉపకరణాలను ఉపయోగించవచ్చు. హై డెఫినిషన్ వీడియోస్ స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యాక్సిస్ పొందేందుకు అవసరమైన బ్యాండ్ విత్, లాటెన్సినీ 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు సంబంధించి ఒక సర్వే ప్రకారం వేగవంతమైన నెట్వర్క్ తమ మొబైల్ సేవలను మరింత మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన ఇండోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి బ్యాండ్ సబ్_1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది.
–వేగపరంగా అయితే
టాప్ లైను స్పీడ్స్ పరంగా చెప్పాలంటే 5జి మార్కెట్లో చేసిన ఈ అధ్యయనం ప్రకారం ప్రస్తుత 4 జి కంటే కూడా 5జి వేగం ఏడు నుంచి పది రెట్లు అధికంగా ఉంటుంది. ఇక మీ ఫోన్ ను కనుక అప్గ్రేడ్ చేయాలనుకుంటే ముందు 5 జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. 4జి సేవలు అందుబాటులోకి వచ్చినప్పుడు అప్పట్లో టారిఫ్ లలో అగ్రిసివ్ ప్రైస్ ( ధరలు బాగా తక్కువగా ఉండటం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉంది.. ఈ రెండు అంశాలతో పాటుగా ప్రస్తుత డిమాండ్లు 5 జి సేవల ప్రోత్సాహకాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు 2016లో దేశంలో జియో టెలికాం సేవలు మొదలైనప్పుడు అది చాలా వినూత్నమైన ప్లాన్లతో గేమ్ చేంజర్ గా ఆవిర్భవించింది. మార్కెట్లో బలమైన శక్తిగా ఆవిర్భవించేందుకు నూతన 4జి నెట్వర్క్ పై సుమారుగా ఆరు నెలల పాటు వాయిస్, డేటా ఉచితంగా అందించింది. దీంతో 4 జి మార్కెట్లో జియో అత్యధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 5జి అప్ గ్రేడ్ ఆఫర్లు మార్కెట్ ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తాము ‘ట్రూ 5జి ” సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.
ఇలా చేస్తే మీ ఫోన్ 5జి సపోర్ట్ చేస్తుంది
మరికొద్ది రోజుల్లో 5 జి సేవలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వాడుతున్న ఫోన్ దానిని సపోర్ట్ చేస్తుందా అనే అనుమానం అందరిలో ఉంటుంది. 2019 లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడానికి పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్ లేదా మీ సిమ్ కార్డుకు సంబంధించిన ప్రిఫర్డ్ నెట్వర్క్ ను పరిశీలించాలి. ఒకవేళ అది 5జీని కూడా సూచించినట్లయితే మీ ఫోన్ 5జి ని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో భారతీయుల్లో చాలామంది 5 జి ఫోన్లను కొనుగోలు చేశారు. వాటిని ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడును పరీక్షించుకుంటున్నారు. అంతేకాక స్పీడ్ టెస్ట్ యాప్ ను తమ ఫోన్లలో రన్ చేస్తున్నారు. దీని ఆధారంగా చూస్తే 5జి అప్ గ్రేడే షన్ కు ఖరీదైన హ్యాండ్ సెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే చెబుతోంది. 5జి సౌకర్యం అందుబాటులోకి వస్తుందనే అంచనాల సెల్ ఫోన్ కంపెనీలు తమ మధ్య స్థాయి హ్యాండ్ సెట్లలో 5జీని సాధరణ ఫీచర్ గా ఉంచారు. మీ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్లో ఎక్కడ కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే మీ ఫోన్ దాన్ని సపోర్ట్ చేయదని అర్థం. అలాంటప్పుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయడమే ఉత్తమం.

మొదట్లో మెట్రో నగరాల్లోనే
అక్టోబర్ నుంచి మొదలయ్యే 5జీ సేవలు మొదట్లో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. తర్వాత అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ వంటి నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తర్వాత అందుబాటులోకి వస్తుంది. అయితే దేశంలో 5జీ సేవలు మొదట అందుబాటులోకి వచ్చే 13 నగరాల పేర్లను కేంద్ర టెలి కమ్యూనికేషన్ విభాగం ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్దపెద్ద నగరాల్లో ఈ కవరేజ్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు త్వరగానే వస్తాయని టెలికామ్ ఆపరేటర్లు అంచనా వేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసినట్టు జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్టెల్ ఉంది. అయితే ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ మధ్య పోటీ ఉంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెలే నెంబర్ వన్ నెట్వర్క్. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆ స్థానాన్ని జియో ఆక్రమించింది. ఈ క్రమంలో పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ఎయిర్టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో 5జి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్లు ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.