Eid al-Adha 2023 – Bakrid : ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో రంజాన్, బక్రీద్ రెండు ఉంటాయి. బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా చెబుతారు. దీన్ని ఈద్ ఉల్ ఆదా అని బక్రా ఈద్, బక్రీద్ ఈద్ ఖుర్బాన్ లేదా ఖుర్బానీ బయారమి అనే పేర్లతో పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో పన్నెండో నెల అయిన జుల్ హిజ్జా, దుల్ హిజ్జా నెలలో పదో రోజు జరుపుకుంటారు. దీనికి ఒక రోజు ముందు తొమ్మిదో రోజున అరఫా దినంగా జరుపుకోవడం సహజం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని ముస్లింలు జూన్ 28న అరఫాత్ జరుపుకుంటున్నారు.
బక్రీద్ ప్రాముఖ్యత
అల్లా సూచన మేరకు మహమ్మద్ ప్రవక్త తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి అంగీకరిస్తాడు. దాన్ని స్మరిస్తూ ఈద్ ఉల్ అదా జరుపుకుంటారు. మహమ్మద్ ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి రెడీ అయినప్పుడు అల్లా జోక్యం చేసుకుంటాడు. అతని కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో సజీవంగా ఉంటాడు. అల్లా తన కొడుకు ప్రాణాలు తీయకుండా కాపాడినందుకు దేవుడిపై నమ్మకంతో జరుపుకునే పండుగే బక్రీద్.
ఖుర్బానీ చేయడంలో..
బక్రా ఈద్ రెండు కలిస్తే బక్రీద్. ఈ రోజు గొర్రెలు, మేకలు వంటి జంతువులను బలివ్వడం ఆనవాయితీ. ఖుర్బానీ చేయడం అంటే త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. బలి ఇచ్చిన జంతువు నుంచి మాంసాన్ని మూడు భాగాలుగా చేస్తారు. అందులో ఒక వంతు తమ కోసం ఉంచుకుంటారు. రెండో వంతు బంధువులు, స్నేహితులకు పంచుతారు. మూడో వంతును అందరికి పంచుతారు. ఇలా కరుణ, దయ, జాలి చూపడం వల్లే దీనికి త్యాగాల పండుగ అని పేరు.
విందులు
బక్రీద్ రోజు ఖుర్బానీని పంచుకోవడం కోసం రుచికరమైన విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరు కలిసి ఆనందంగా వేడుకల జరుపుకుంటారు. అల్లా తన ప్రేమను అందరికి పంచుతాడని చెబుతారు. తనపై విశ్వాసం ఉంచిన అందరికి సంతోషాలు పంచడమే భావనగా తలుస్తారు. భక్తి భావం సోదర భావం పెంపొందిచుకుంటారు. ఇలా బక్రీద్ పండుగ అందరిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.