Children Intelligent: ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం చాలా ప్రధాన విషయం గా మారింది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగ, వ్యాపార రీత్యా బిజీగా ఉండడంతో పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో వారు జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను నేర్చుకోలేకపోతున్నారు. ఫలితంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
చాలామంది తల్లిదండ్రులు ఉదయం లేవగానే తమ కార్యక్రమాలను నిర్వహించుకుని ఉద్యోగం, వ్యాపార స్థలాలకు వెళ్లిపోతారు. కానీ కొంచెం ఎర్లీగా నిద్రలేచి మీతో పాటు పిల్లలను కూడా నిద్ర లేపండి. వారికి బ్రష్ ఎలా వేసుకోవాలో నుంచి.. ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాల వరకు దగ్గరుండి అన్ని నేర్పించాలి. ఉదాహరణకు బ్రేక్ఫాస్ట్ గా లైట్ గా ఉండే ఆహారం తీసుకునే అలవాటు చేయాలి. భవిష్యత్తులో కూడా వారు ఇలాంటి ఆహారాన్ని తీసుకోగలుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు సమయం లేదనే కారణంతో ఉదయమే ఆయిల్ లేదా హెవీ ఫుడ్ పెడుతూ ఉంటారు. ఇది వారికి ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది.
తల్లిదండ్రులు ఉదయం లేవగానే వాకింగ్ లేదా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలతో కూడా వ్యాయామం చేయించే బాధ్యత తీసుకోవాలి. వారికి ఇప్పటినుంచే వ్యాయామంపై ఆసక్తి పెంచితే భవిష్యత్తులో వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. ఫలితంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కొంతమంది నేటి పిల్లలకు ఇంటి పనులు అంటే ఏంటో తెలియకుండా పోయింది. అందువల్ల పిల్లలకు ఇప్పటినుంచే ఇంట్లో ఎలాంటి పనులు చేయాలో నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలకు కిచెన్ గురించి పూర్తిగా తెలిసే బాధ్యత తీసుకోవాలి. కిచెన్ పై అవగాహన ఉంటేనే భవిష్యత్తులో వారు తమ కుటుంబాన్ని చక్కబెడతారు.
సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలతో కలిసి కాలక్షేపానికి సమయం కేటాయించాలి. వారితో హోంవర్క్ చేయించాలి. సమయం ఉంటే వారితో కలిసి సరదాగా టీవీ చూడడం వంటి ప్లాన్ చేయాలి. అయితే ఈ టీవీలో విజ్ఞాన ప్రదర్శనలకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. వారికి కొత్త విషయాలను చెబుతూ వారితో కలిసి టీవీ చూసే ప్రయత్నం చేయాలి. అలా వారిని అలవాటు చేయడంతో విజ్ఞానానికి సంబంధించిన వీడియోలు చూస్తూ నాలెడ్జిని పెంచుకుంటారు.
ఉద్యోగులైన, విద్యార్థులైన వారం రోజులపాటు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేటకు వీకెండ్ డేస్ ప్లాన్ చేయాలి. వారానికి ఒకసారి కొత్త ప్రదేశానికి వెళ్లే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంతవరకు వారితో సరదాగా ఉండే ప్రయత్నం చేయాలి. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి అయినా దూర ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లాలి. ఇలా పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేస్తే వారిలో విజ్ఞానం పెరుగుతుంది. ఒకవైపు ఆధునిక చదువుతోపాటు మరోవైపు సంస్కృతి సంప్రదాయాలకు కూడా విలువ ఇవ్వాలి. ఆచార వ్యవహారాలను వారికి నేర్పుతూ చరిత్ర గురించి కూడా చెబుతూ ఉండాలి. అలాగే రాత్రి పడుకునే ముందు నీతి కథలు చెప్పడం అలవాటు చేయడంతో వారు ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు.