Homeఎడ్యుకేషన్TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీలో ఏం జరుగుతోంది.. పేపర్‌ లీకేజీలో తప్పెవరిది!?

TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీలో ఏం జరుగుతోంది.. పేపర్‌ లీకేజీలో తప్పెవరిది!?

TSPSC Leakage: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అసలు ఏం జరుగుతోంది.. పకడ్బందీగా ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రం లీక్‌ కావడం లేదనికి సంకేతం. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు.. ప్రభుత్వ పర్యవేక్షణ గాడి తప్పుతోందా అంటే అవుననే సమాధానమే నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తోంది. తాజా పరిణామాలు టీఎస్‌పీఎస్సీ ఉణికికే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భవిష్యత్‌ పరీక్షలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

లీకేజీల కలకలం..
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తుంది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా, మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షకు రెండు రోజుల ముందే పేపర్‌ లీకైనట్లు తేలింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో ఇప్పటికే 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌తోపాటు పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. పేపర్‌ కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను కూడా అరెస్టు చేశారు. పేపర్‌ లీకేజీ నేపథ్యంలో అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉందని తెలుస్తుంది.

పర్యవేక్షణ ఏమైంది..
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఓ పక్క అనుమానితుల్ని విచారిస్తూనే మరో వైపు సైబర్‌ క్రై మ్‌ పోలీసుల సహకారంతో బేగంబజార్‌ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు సర్వర్‌లోకి వెళ్లి లాగిన్‌ అయినట్టు పోలీసులకు అధికారులు తెలపడంతో ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. దళారుల వ్యవహారం కూడా బయటకు రావడంతో అనుమానితుల వేటలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. మార్చి12న జరగాల్సిన పట్టణ భవన ప్రణాళిక పర్యవేక్షణ అధికారి, ఈనెల 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షను సంబంధించిన పేపర్‌ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. అసలు టీఎస్‌పీఎస్సీపై పర్యవేక్షణ లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యమా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పేపర్‌ లీకేజీలో ట్విస్టులు..
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు బయటపడుతోన్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలను చేధించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుక తన తమ్ముడికి ఉద్యోగం తెప్పించేందుకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌తో కలిసి పేపర్‌ లీక్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల్‌ పంచగల్‌ తండాకు చెందిన రేణుక ప్రస్తుతం వనపర్తి గురుకుల స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే తన తమ్ముడు రాజేశ్వర్‌నాయక్‌ ఎప్పటినుంచో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. దీంతో అతడికి ఉద్యోగం వచ్చేలా చేసేందుకు రేణుక తన భర్త ఢాక్యానాయక్, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌తో కలిసి పేపర్‌ లీక్‌కు ప్లాన్‌ చేసిందని తేలింది.

పాత పరిచయమే..
లీకేజీ సూత్రధారి ప్రవీణ్‌ తండ్రి హరిచంద్రరావు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ విధి నిర్వహణలో మృతి చెందాడు. దీంతో ప్రవీణ్‌కు కారుణ్య నియామకం కేటగిరిలో ఉద్యోగం వచ్చింది. అయితే రేణుక గతంలో గురుకుల ఉపాధ్యాయ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న టైమ్‌లో అప్లికేషన్‌లో కొన్ని తప్పులు దొర్లాయి. అప్పుడు తప్పులు సరిచేసుకునేందుకు రేణుక టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ప్రవీణ్‌తో పరిచయమైంది. ప్రవీణ్‌ ఫోన్‌ నంబర్‌ తీసుకున్న రేణుక.. అప్పుడప్పుడు అతడితో మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయంతో తమ్ముడి కోసం పేపర్‌ సంపాదించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఐపీ అడ్రస్‌ను తెలుసుకున్న ప్రవీణ్‌.. నెట్‌వర్క్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌ రెడ్డితో కలిసి ప్రశ్నాపత్రాన్ని సేకరించాడు. ఇందుకు రేణుక దగ్గర రూ.10 లక్షలు తీసుకున్నాడు. రేణుక దంపతులు ఈ ప్రశ్నాపత్రాలను రూ.13 లక్షలకు వేరే అభ్యర్థులకు విక్రయించారు.

విశ్వసనీయత ప్రశ్నార్థకం..
తాజా పరిణామాలతో టీఎస్‌పీఎస్సీ విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో ఏళ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో నిరుద్యగులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. నిద్రాహారాలు మాని, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ఉద్యోగాన్ని సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో టీఎస్‌పీఎస్పీ పేపర్లు లీక్‌ కావడం నిరుద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version