
Triple R war between BRS.. BJP: తెలుగు పాట నాటు.. నాటు.. విశ్వవ్యాప్తంగా మార్మోగుతోంది. తెలుగు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతీ భారతీయుడు ఇది మా భారతీయ సినిమా అని.. ప్రతీ తెలుగోడు ఇది మా పాట అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఇందులోనూ రాజకీయం వెతుక్కుంటున్నాయి. గర్వించే క్షణాలను రాజకీయం చేస్తున్నాయి.
భారతీయుడిగా గర్వించే క్షణాలు..
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు.. నాటు.. పాటకు ఆస్కార్ రావడంతో భారతీయులకు ప్రత్యేకించి తెలుగువారికి ఈరోజు అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. అయితే ఇదే సందర్భంలో ఈ సినిమాకు ఆస్కార్ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్రిపులార్ సినిమా పాటకు ఆస్కార్ రావడంపై తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ స్పందించారు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు
వారికి గర్వకారణం అని వ్యాఖ్యానించిన శ్రీనివాస్‌గౌడ్, ఈ సినిమా యూనిట్ ను సీఎం పర్మిషన్‌తో ఘనంగా రిసీవ్ చేసుకుంటామని, సినిమాటోగ్రఫీ మరియు పర్యాటకశాఖ తరఫున సత్కరిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను అధికారికంగా ఆస్కార్‌కు పంపకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. దక్షిణాదిపై, తెలుగువారిపై వారికి ఉన్న చిన్నచూపు కంటిన్యూ చేస్తూ గుజరాతి సినిమా ఛల్లో షో సినిమాని ఆస్కార్ కి పంపించారని తెలిపారు. కానీ ఆ సినిమా నామినేషన్ల పరిధి దాటి ముందుకు వెళ్లలేక వెనక్కి వచ్చేసిందని పేర్కొన్నారు.
ప్రైవేటు నామినేషన్‌తో..
తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌పై కేంద్రం చిన్నచూపు చూసినా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రైవేట్ నామినేషన్ ద్వారా వెళ్లి ఆస్కార్ తీసుకువచ్చింది అని మంత్రులు తెలిపారు. దీంతో బీజేపీ నేతలు కూడా అందుకు దీటుగా సమాధానం ఇస్తున్నారు. భారతీయ సినిమాకు ఆస్కార్ వచ్చిందని ప్రతీ భారతీయుడు గర్విస్తుంటే బీఆర్‌ఎస్ మంత్రులు మాత్ర అవార్డును ఒక రాష్ట్రానికి పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ పురస్కారం భారతీయులుగా అందరూ గర్వించాలని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాని, దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు చేస్తామంటున్న నేతలు.. ప్రపంచ పురస్కారాన్ని భారత జాతికి వచ్చినట్లుగా భావించకపోవడం బీఆర్‌ఎస్ నేతల సంకుచిత భావానికి నిందర్శనమంటున్నారు.
మొత్తంగా తెలుగు సినిమాపై అందరూ సంబరాల్లో ఉంటే.. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాత్రం క్రెడింట్ కోసం కొట్టుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంకుచిత భావాన్ని తెలియజేస్తోంది.