International Mutual Funds: క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. రూపాయి మళ్లీ పతనమైంది. స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అని మనం రోజు వార్తలు చూస్తుంటాం. పత్రికల్లో చదువుతూ ఉంటాం. విదేశీ ఇన్వెస్టర్లు మనదేశంలో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ మనం విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండదా? మనలో చాలామందికి ఈ సందేహం ఉంటుంది. నిజంగా మనం విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలంటే ఏం చేయాలి? దానికి ఉన్న మార్గం ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందించే అంతర్జాతీయ పథకాలతో మనం కూడా విదేశీ కంపెనీలో డబ్బులను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. దేశీయంగా ఉన్న స్టాక్ మార్కెట్లో కాకుండా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇంటర్నేషనల్ పథకాలు అండగా ఉన్నాయి. తమ పోర్టుఫోలియో కి మరింత బలం చేకూర్చాలనుకునేవారు, నష్టమైనా పర్లేదు ధైర్యంగా మదుపు చేస్తామని ధీమా ఉన్నవారూ వీటిని పరిశీలించవచ్చు. తద్వారా దేశీయ మార్కెట్ ను దాటి అంతర్జాతీయ స్థాయిలో మదుపు చేసే అవకాశాలను దక్కించుకోవచ్చు. వాస్తవానికి మదుపుదారులు తమ పెట్టుబడుల్లో వైవిధ్యం చూపాలి. రాకేష్ ఝున్ ఝున్ వాలను చూడండి పెట్టుబడులు పెట్టే విధానంలో ఎంతో వైవిధ్యం చూపారు. అందుకే ఆయన ఇండియన్ వారెన్ బఫెట్ అయ్యారు. ఆయన కన్నుమూసినా నేటికీ ఆయననే స్టాక్ మార్కెట్లో తలుచుకుంటున్నారంటే ఆయన ఎంతటి ప్రభావం చూపారు అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. మరింత రాబడిని ఆర్థించాలంటే విదేశాల్లోని మార్కెట్లలో ఆర్థిక సంస్థల్లో మదుపు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్జించవచ్చు. ఎలాగూ విదేశాల పేరు చెప్పామని ఎందులో పడితే అందులో మదుపు చేయకూడదు. ఆ దేశ ఆర్థిక స్థితి, ప్రభుత్వపరమైన విధానాలు, కంపెనీల లాభనష్టాలు ఇవన్నీ బెరీజు వేసుకోవాలి.

అలాగని అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయని అసలు అనుకోవద్దు. కొన్నిసార్లు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఆర్థిక పరిపుష్టి కలిగిన అమెరికా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అక్కడి మార్కెట్లను గమనిస్తే దిద్దుబాటు గరిష్ట స్థాయి నుంచి 32 శాతం వరకు పడిపోయింది. అదే సమయంలో భారతదేశంలో మిడ్, స్మాల్ క్యాప్ లు స్థిరంగా నిలబడ్డాయి. ఇక అంతర్జాతీయ ఫండ్ లను దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. అయితే వీటిల్లో మదుపు చేసే ముందు అవి అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. పథకాలు ఆఫర్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ సంస్థ ఈ ఏ సూచీలో పెట్టుబడులు పెడుతుందో తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఆన్లైన్లో లేదా సలహాదారుడి వద్దకు వెళ్లి సంప్రదింపులు జరిపిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలి. స్టాక్ మార్కెట్ అంటేనే లాభనష్టాలు కాబట్టి.. మనకు మరిన్ని ఎక్కువ రాబడులు రావాలంటే క్రమానుగత పెట్టుబడి లేదా సిప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ సంస్థల ద్వారా విదేశాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు మన పోర్టుఫోలియోకి మరింత బలం ఇస్తాయి. దీనివల్ల దేశీయంగా మాత్రమే పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ఇవి తప్పిస్తాయి. రతన్ టాటా చెప్పినట్టు సంపద సృష్టించాలంటే రాబడి అధికంగా ఉండాలి. ఆ రాబడి అధికంగా ఉండాలంటే మనం పెట్టే పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండాలి. అన్నింటికీ మించి ఆయా దేశాలు అమలు చేస్తున్న ఆర్థిక పథకాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండాలి. ఇలాంటప్పుడే మనం పెట్టిన పెట్టుబడికి ఎక్కువ లాభాలు కళ్ల చూడవచ్చు.