Virat Kohli Sankranti Century: ఒక్కో ప్లేయర్ కు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.. సెంచరీ చేయగానే సచిన్ టెండుల్కర్ ఆకాశం వైపు చూస్తాడు.. వీరేంద్ర సెహ్వాగ్ అయితే హెల్మెట్ తీసి తలను కిందకి వంచి ప్రేక్షకులకు అభివాదం చేస్తాడు. యువరాజ్ సింగ్ అయితే బ్యాట్ ను స్టైల్ గా పట్టుకొని గాల్లోకి ఊపుతాడు. మరి ఇప్పటి ఇండియన్ క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మాత్రం సంక్రాంతి పర్వదినం వస్తే శివాలూగిపోతాడు.. సెంచరీలతో కదం తొక్కుతాడు.. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైనదైనప్పటికీ, బౌలర్ ఎంతటి తోపు అయినప్పటికీ.. వెనక్కి తగ్గడు.. నా దూకుడు సాటి ఎవడు అన్నట్టుగా బ్యాట్ తో శివతాండవం చేస్తాడు.. బౌలర్లకు విరాటపర్వాన్ని 70mm స్క్రీన్ లో చూపిస్తాడు.. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన విధ్వంసకరమైన ఆట తీరును అభిమానులకు పరిచయం చేశాడు.. 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు చేశాడు.. తన అసాధారణ బ్యాటింగ్ తో అభిమానులకు సంక్రాంతి సంబరాలను డబుల్ చేశాడు.. అయితే విరాట్ కోహ్లీకి సంక్రాంతి పండుగకు ప్రత్యేక అనుబంధం ఉంది.. ఈ పర్వదినాన అంటే జనవరి 15న కోహ్లీ తాజా సెంచరీ తో కలిపి ఏకంగా నాలుగు సెంచరీలు కొట్టాడు.

2017లో
2017లో సంక్రాంతి రోజే ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ… 2018 సంక్రాంతికి సౌత్ ఆఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. 2019లో సంక్రాంతి సందర్భంగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 112 బంతుల్లో 104 పరుగులు చేశాడు.. ఇక 2020 నుంచి 2022 వరకు విరాట్ కోహ్లీ తన కెరీర్లో అత్యంత దారుణమైన పరిస్థితిని చూశాడు. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.. దీంతో అతడిని జట్టులో ఉంచడం దండగ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాధి అభిమానులకు పూనకాలు తెప్పించాడు.. అంతేకాదు ప్రస్తుతం కోహ్లీ గణాంకాలు చూస్తే సమీప భవిష్యత్తులో అతడి రికార్డులను చేదించడం అంత ఈజీ కాదు.. ఇక ఈరోజు సెంచరీ తర్వాత ప్రత్యర్థి ఎవరైనా, వేదిక ఏదైనా… సంక్రాంతి రోజు విరాట్ కోహ్లీ సెంచరీ బాదడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రికార్డుల మోత
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించి తన కెరియర్లో 46వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ… సచిన్ రికార్డుకు మూడు అడుగుల దూరంలో ఉన్నాడు.. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ 74 సెంచరీలు నమోదు చేశాడు.. సచిన్ 100 సెంచరీల రికార్డు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.. ఇప్పటివరకు శ్రీలంక జట్టుపై 10 వన్డే సెంచరీలు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాదు 259 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి 46 సెంచరీలు పూర్తి చేశాడు.. సచిన్ 450 ఇన్నింగ్స్ లు ఆడి 49 శతకాలు పూర్తి చేశాడు. ఇక విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై చేసిన 183 పరుగులు అతడి అత్యధిక వన్డే స్కోర్ గా ఉంది. వన్డే క్రికెట్ చరిత్రలో నాలుగు సార్లు 150 కంటే ఎక్కువ పరుగులతో అజయంగా నిలిచిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించేందుకు కేవలం 3 సెంచరీల దూరంలోనే ఉన్నాడు.