Virat Kohli: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాండవం చేశాడు.. సంక్రాంతి రోజున ఇండియన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. (110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 166 పరుగులు) తిరువనంతపురంలో విధ్వంసకర సెంచరీ తో చెలరేగిపోయాడు.. అనితర సాధ్యమైన బ్యాటింగ్ తో రికార్డుల మోత మోగించాడు.. ఈ సెంచరీతో కెరియర్లో 46వ వన్డే సెంచరీ పూర్తి చేసుకుని.. సచిన్ 49 సెంచరీల రికార్డుకు మూడు అడుగుల దూరంలో నిలిచాడు.. ఓవర్ ఆల్ గా 74 వ సెంచరీ నమోదు చేసి… సచిన్ 100 సెంచరీల రికార్డు అధిగమించే దిశగా దూసుకుపోతున్నాడు. 259 ఇన్నింగ్స్ లోనే విరాట్ కోహ్లీ 46 సెంచరీలు పూర్తి చేయగా… సచిన్ 452 ఇన్నింగ్స్ ల్లో 49 శతకాలు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై నమోదు చేసిన 183 పరుగులు అతడి అత్యధిక వన్డే స్కోర్ గా ఉంది.

శ్రీలంకపై పది సెంచరీలు
ఇక శ్రీలంకపై 10 వన్డే సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.. ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్ గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.. గ్రీన్ ఫీల్డ్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు..తన వన్డే కెరీర్ లో అత్యధిక సిక్సులు (8) బాదాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే నాలుగు సార్లు 150 కంటే ఎక్కువ పరుగులతో అజేయంగా నిలిచిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. గత నాలుగు వన్డే ఇన్నింగ్స్ ల్లో విరాట్ మూడు సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్ పై 113, శ్రీలంకపై 113, 4, 166 పరుగులు చేశాడు..

ఐదో స్థానంలో..
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే (12,650) ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ ఇప్పటివరకు 12,754 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో ఇవాళ జరిగిన మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీకి అండగా శుభ్ మన్ గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్స్ లతో 116 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 42, శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా, లాహిరు కుమార రెండేసి వికెట్లు, కరుణ రత్న ఒక వికెట్ తీశారు.