Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీమిండియా పరుగులు యంత్రం. ఇతడి బ్యాటింగ్, ఫిట్ నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మైదానంలో చిరుతలా పరుగెత్తుతాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అలాంటి ఈ మేటి బ్యాట్స్ మెన్ గత కొద్దిరోజులుగా ఫామ్ లేమితో బాధపడ్డాడు. అలవోకగా పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ సెంచరీ సాధించేందుకు మూడేళ్లపాటు ఎదురుచూశాడు. ఆ మూడేళ్లు పరీక్ష కాలాన్ని ఎదుర్కొన్నాడు. విమర్శకుల తిట్లని భరించాడు. కొందరైతే తన కుమార్తెను ఎత్తుకెళ్తామని బెదిరించారు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మళ్లీ గాడిలో పడ్డాడు. ఇప్పుడు మరో అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎదురుచూస్తున్నాడు.

ఆ కరువు తీర్చాడు
కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా అడి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. దీంతో కోహ్లీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆ సెంచరీతో కోహ్లీ తనపై ఉన్న భారాన్ని మొత్తం దించేసుకున్నాడు. విమర్శకుల మాటలకు తన ఆట తీరుతో సమాధానం చెప్పాడు. అంతేకాదు మైదానంలో చిన్నపిల్లాడి మాదిరి ఏడ్చాడు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన టి20 మెన్స్ వరల్డ్ కప్ పోటీల్లో అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. అయితే దురదృష్టవశాత్తు సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ టీం చేతిలో భారత్ కోడి ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది.. అయితే ఈ టోర్నీలో విరాట్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నాడు.
బంగ్లా తో మూడో వన్డేలో..
బంగ్లాదేశ్ లో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ల్లో కోహ్లీ అంతగా ఆకట్టుకోలేదు. అయితే మూడో మ్యాచ్లో తనకు అచ్చి వచ్చిన మూడో స్థానంలో దిగి అదరగొట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లను బెదరగొట్టాడు. ఇషాన్ కిషన్ తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్ కు 200 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అదే ఊపులో తన కెరియర్లో 72వ శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడిన మాటలు శతకం కోసం ఎంత ఎదురు చూసాయో చెప్పాయి..

మరో కలికితురాయికి సిద్ధం
కోహ్లీ తిరిగి ఫామ్ అందుకున్న తర్వాత అతడు బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లో ఆడతాడు.. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా కోహ్లీ సెంచరీ సాధిస్తే… కోహ్లీ కిరీటంలో మరో వజ్రం చేరినట్టే. టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో ఒకే ఏడాది లో సెంచరీలు సాధించిన బ్యాటర్ ఎవరూ లేరు. ఒకవేళ కనుక కోహ్లీ సెంచరీ సాధిస్తే ఈ రికార్డు నెలకొల్పిన తొలి బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టిస్తాడు. భారత అభిమానులు కూడా కోహ్లీ నుంచి ఇదే కోరుకుంటున్నారు. మరి కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.