CM Jagan: ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏపీ సీఎం జగన్ అరుదైన చాన్సిచ్చారు. గత మూడున్నరేళ్లుగా వారు ఎంత మానసిక క్షోభ అనుభవించారో గుర్తించినట్టున్నారు. అందుకే వారికి సరికొత్తగా ఒక అవకాశమిచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటు వచ్చే ఏడాది బటన్ నొక్కుడుకు సంబంధించి సహచర మంత్రుల ఆమోదం తీసుకున్నారు. తాను బటన్ నొక్కుతానని.. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హితోపదేశం చేశారు. ఎన్నికలకు లాస్ట్ ఈయర్ కావడంతో మీడియా వాచ్ చేస్తుందని.. ఎటువంటి అవినీతి, తప్పిదాలకు అవకాశం లేకుండా చూసుకోవాలని సూచించారు. అయితే అసలు అవినీతి అంటే ఏమిటన్న రీతిలో మంత్రులు కూడా అధినేత మాటలను అమాయకంగా చూస్తూ విన్నారు.అదే స్పీడులో తలూపారు. అయితే గత మూడున్నరేళ్లుగా ఏ రోజు కోసమైతే చూస్తున్నారో.. సీఎం జగన్ అదే మాట చెప్పేసరికి తెగ ఆనంద పడ్డారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తన మానస పుత్రిక అయిన వలంటీరు వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ 50కుటుంబాలకు ఒక వలంటీరును నియమించి…పౌరసేవల నుంచి సంక్షేమ పథకాల అమలు వరకూ వారితోనే చేయిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేస్తున్నా… అవి వలంటీర్ల క్రెడిట్ లోకి వెళ్లిపోతుందే తప్పప్రభుత్వం ఇస్తుందని ప్రజలు భావించడం లేదు. ఒక వేళ ఆ భావనకు వస్తే ప్రభుత్వం ఉత్తగా ఇస్తుందా? మేము కట్టిన పన్నులనే కదా తిరిగి ఇస్తుంది అంటూ ప్రశ్నించిన వారూ ఉన్నారు. అందులో కృషి ఉందటే అది ముమ్మాటికీ వలంటీర్లదేనని నమ్ముతున్న వారు ఏపీ సమాజంలో ఇప్పడు ఎక్కువయ్యారు. తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నది వలంటీర్లేనని నమ్ముతున్నారు. దీంతో పెద్దసార్లుగా ఉన్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇది మింగుడుపడడం లేదు. పైగా గడపగడపకూ పలకరించడానికి వెళుతున్న వారికి పథకాలు ఎవరిస్తున్నారని అడుగుతుంటే.. ఇంకెవరు మన వలంటీర్లే కదా అని దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ముఖం ఎక్కడ పెట్టాలో తెలియక వెనుదిరుగుతున్నారు.
అయితే దీనిపై ఫిర్యాదులు వచ్చాయో.. లేక ఎమ్మెల్యేలు, మంత్రుల బాధను గుర్తెరిగారో తెలియదు కానీ.. జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో ఇక నుంచి ఎటువంటి పథకమైనా.. ఏ కార్యక్రమమైనా ఎమ్మెల్యేలు, మంత్రులతోనే చేయిస్తానని తేల్చిచెప్పారు. త్వరలో ఎనిమిదో తరగతి వారికి అందించే ట్యాబులు మీతోనే పంపిణీ చేయిస్తానని చెప్పడంతో మంత్రులు తెగ ఖుషీ అయ్యారు. ఇదేవిషయం ఎమ్మెల్యేలకు చెప్పి పండుగ చేసుకోవాలని చెప్పడంతో అమాత్యులు సైతం ఆనందం వ్యక్తంచేశారు. తమకు మంచి ఊరటనిచ్చారని వారు తెగ సంబరపడిపోయారు.

కేబినెట్ భేటీలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోకున్నా.. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో పింఛన్ మొత్తాన్ని రూ.2,750కు పెంచుదామని కూడా జగన్ ప్రకటించారు. అయితే అదిసాధ్యమేనా? అని మంత్రులు బిక్కముఖం వేసినట్టు తెలుస్తోంది. రెండో వారం దాటి మూడో వారం సమీపిస్తున్నా ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ కొత్త కష్టం ఎందుకని కొందరు మంత్రులు తమ మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచారు. ఎలాగోలా ప్రజలకు సర్ధిచెబుదామని కూడా కొందరు అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే దీనిపై జగన్ రియాక్టయినట్టు తెలుస్తోంది. . నా కష్టమేదో నేను పడి బటన్ నొక్కుతాను. మీ పని మీరు చేయండి….గడపగడపకూ వెళ్లి ప్రజలను కలవండి అనేసరికి.. మళ్లీ స్టార్ట్ చేశారంటూ గొనుక్కోవడం మంత్రుల వంతైంది. .