Vanne Taggindi Meaning: మన రోజువారీ జీవితంలో ‘వన్నె తగ్గింది’ అనే మాటను తరచుగా వింటుంటాం. ఒక వ్యక్తి ప్రభావం తగ్గినా.. ఒక వస్తువు మెరుపు కోల్పోయినా.. ఒక ప్రదేశం పాత గౌరవం కోల్పోయినా ఈ నానుడిని ఉపయోగిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ ‘వన్నె’ అనే పదానికి బంగారంతో చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకుందాం..
బంగారం గురించి తెలిపేటప్పుడు పాత రోజుల్లో ఇప్పటిలా ‘క్యారెట్లు’ అనే పదం విస్తృతంగా వాడుకలో లేదు. అప్పట్లో బంగారం నాణ్యతను ‘వన్నె’ల ద్వారా చెప్పేవారు. 16 వన్నెల బంగారం అంటే పూర్తిగా స్వచ్ఛమైన బంగారం అని అర్థం. అదే నేటి 24 క్యారెట్ గోల్డ్‌కు సమానం. అలాగే 14.6 వన్నెలు అంటే ప్రస్తుతం మనం చెప్పుకునే 22 క్యారెట్ బంగారం. అంటే వన్నెలు తగ్గిన కొద్దీ బంగారంలో ఇతర లోహాల మిశ్రమం పెరిగిందని భావించేవారు.
బంగారం ఎక్కువకాలం వాడితే దాని మెరుపు కొద్దిగా తగ్గుతుంది. అప్పట్లో అలాంటి సందర్భాల్లో ‘బంగారం వన్నె తగ్గింది’ అని చెప్పేవారు. ఇక్కడ ‘వన్నె’ అంటే కేవలం రంగు కాదు.. స్వచ్ఛత, మెరుపు, విలువ అన్నీ కలిపిన భావం. క్రమంగా ఈ పదం బంగారాన్ని దాటి మనుషులు, వస్తువులు, పరిస్థితులకు కూడా వర్తించసాగింది.
ఉదాహరణకు ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన వ్యక్తి ఇప్పుడు గుర్తింపు కోల్పోతే ‘అతని వన్నె తగ్గింది’ అంటారు. అలాగే ఒక ఊరు పాత అందం కోల్పోయినా, ఒక సంస్థ ప్రభావం తగ్గినా అదే మాట వాడుతారు. అంటే ‘వన్నె’ అనే పదం ఇప్పుడు ప్రతిష్ట, ఆకర్షణ, విలువ, గౌరవం అనే అర్థాలన్నింటినీ సూచించే నానుడిగా మారిపోయింది.
తెలుగు భాషలో ఇలాంటి పదాలకు గొప్ప చరిత్ర ఉంటుంది. సాధారణంగా వినిపించే మాటల వెనుక సామాజిక జీవితం, వ్యాపార పద్ధతులు, పాత కొలమానాలు దాగి ఉంటాయి. ‘వన్నె తగ్గింది’ అనే నానుడి కూడా అలాంటి చారిత్రక ప్రయాణం చేసిన పదాల్లో ఒకటి. బంగారం మెరుపు నుంచి మొదలైన ఈ మాట.. ఇప్పుడు మన భావోద్వేగాలను కూడా వ్యక్తపరచే సామెతగా మారిపోయింది.
