Twitter Blue Tick Price: వ్యాపారం అంటే.. సమాజసేవ కాదు. పెట్టిన పెట్టుబడి పై లాభాలు ఆర్జించడం.. ఈ విషయం ఎలన్ మస్క్ కు బాగా తెలుసు. అందుకే తన టెస్లా ను నంబర్ వన్ బ్రాండ్ గా తీర్చిదిద్దాడు. ఇప్పట్లో ఆ కంపెనీని దాటేసే ఆలోచనలో మరో కంపెనీ చేయకపోవచ్చు. ఇక నికర ఆస్తుల్లో ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్నాడు. అటువంటి మస్క్ అనేక నాటకీయ పరిణామాలు తర్వాత ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. వచ్చిన వెంటనే పరాగ్ అగర్వాల్, గద్దె విజయను బయటకు పంపించాడు. ఇంకా చాలా చాలా మార్పులు చేస్తానని ప్రకటించాడు. అన్నట్టుగానే షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.

బ్లూటిక్ విషయంలో మార్పులు
ట్విట్టర్ ను టేక్ ఓవర్ చేసిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మస్క్ చేయబోయే మార్పులు, తీసుకునే నిర్ణయాల గురించి రకరకాల ఊహాగానాలు, ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బ్లూ టిక్ కు సంబంధించి మాస్క్ మార్పులు చేర్పులు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్, డ్యూటీలో కోసం కొంత మొత్తం వసూలు చేసేందుకు మాస్క్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్లో వెరిఫైడ్ అకౌంట్స్ కి బ్లూ టిక్ ఇస్తారు. దానికోసం కొన్ని దశల్లో అకౌంటును వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ మరింత సులువు కానుంది.

అయితే వెరిఫై అయిన అకౌంట్స్ కు వచ్చిన బ్లూటిక్ పర్మినెంట్ గా ఉండాలంటే ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ లో 411 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇకపై ఆ బ్లూ టిక్ కోసం నెలకు 1647 చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా, ఎన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసుకున్నా బ్లూ టిక్ మాత్రం కనిపించదు. దీన్ని నవంబర్ 7 లోగా రోల్ అవుట్ చేసి అందుబాటులోకి తేవాలని మస్క్ ట్విట్టర్ మేనేజ్ మెంట్ కు సూచించాడు. అయితే ఈ నిర్ణయం పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. మస్క్ రాగానే యూజర్లపై పడ్డాడు అంటూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రకటనల విషయంలోనూ తగ్గేదే లేదు అన్నట్టుగా రేట్లు కూడా పెంచే యోచనలో మస్క్ ఉన్నాడు.