
Twitter: ట్విట్టర్ అధినేత, టెస్లా కార్ల తయారీ దారుడు, ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వింత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక అందులో సమూల మార్పులు చేస్తున్నాడు. ట్విట్టర్ సీఈవోగా బాధ్యలు చేపట్టాక తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. చాలా మంది ఉద్యోగులను తొలగించి తన మార్క్ చూపిస్తున్నారు. ఫలితంగా వారు రోడ్డున పడాల్సి వస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు తనకు ఏది మంచిగా ఉందనిపిస్తే దాన్ని అమలు చేస్తున్నాడు. ట్విట్టర్ లో సమూల మార్పులకు తెర తీస్తున్నాడు.
ట్విట్టర్ లోగో తొలగింపు
ఇన్నాళ్లు ట్విట్టర్ లోగో గా ఉన్న బ్లూ బర్డ్ ను తొలగించి ఓ కుక్కను పరిచయం చేశాడు. క్రిష్టోకరెన్సీలో ఒకటైన డోజ్ కాయిన్ లోగోగా వినియోగించుకునేందుకు శునకం ఫొటోను ఉంచాడు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డోజ్ కాయిన్ నెటిజన్లకు సుపరిచితమే. యూజర్లు ట్విట్టర్ ఖాతా తెరవగానే రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం ఇస్తోంది. ప్రస్తుతం వెబ్ వెర్షన్ కు మాత్రమే లోగో మారింది. దశల వారీగా అన్ని విభాగాలకు విస్తరించే అవకాశం ఉంది.
షిబా ఇను
డోజ్ కాయిన్ లోగోగా షిబా ఇను అనే కుక్క ఫొటోను వాడుతున్నారు. 2013 నుంచి ఈ లోగోను కొనసాగిస్తున్నారు. జపాన్ కు చెందిన వేట జాగిలం ఇది. నెటిజన్లకు ఇది సుపరిచితమే. షిబా ఇను జాగిలం మీమ్స్ చిర పరిచితమే. ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోకు బదులు డోజ్ కాయిన్ షిబా ఇను అనే జాగిలం ఫొటోను వాడుతున్నారు. ఇలా ఎలాన్ మస్క్ తన ఇష్టానుసారం ట్విట్టర్ ను మారుస్తున్నారు. దీంతో నెటిజన్లు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏకపక్ష నిర్ణయాలు
మస్క్ తన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఎవరిని సంప్రదించకుండానే నిర్ణయాలు అమలు చేస్తున్నారు. కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. దీంతో వారు కూడా అసహనంగానే ఉంటున్నారు. కానీ తాను అనుకున్నది చేస్తూ నియంతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ఇంకా ఏ మార్పులు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. ఇప్పటికే బ్లూ టిక్ మార్కును కూడా తొలగించారు. ప్రస్తుతం ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి.