Homeలైఫ్ స్టైల్Summer Heat Sleeping Tips: వేసవిలో ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా.. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది..

Summer Heat Sleeping Tips: వేసవిలో ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా.. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది..

Summer Heat Sleeping Tips: వేసవి కాలంలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామందికి నిద్ర సమస్యలు ఎదురవుతుంటాయి. ఫ్యాన్ తిరుగుతున్నా గది వేడిగా అనిపించడం, చెమటలు పట్టడం, ఉక్కపోతతో పలుమార్లు మేల్కొనడం వంటి ఇబ్బందులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రలేమి కారణంగా అలసట, చిరాకు, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది..

వేసవిలో నిద్రపోయే సమయంలో సింథటిక్ లేదా బిగుతైన దుస్తులు ధరించడం వల్ల శరీరానికి గాలి సరిగా తగలదు. దీంతో చెమట ఎక్కువై అసౌకర్యం కలుగుతుంది. కాటన్ దుస్తులు అయితే చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే రాత్రి వేళల్లో వీలైనంత లైట్ కలర్ కాటన్ నైట్‌డ్రెస్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరుపుపై వేసే బెడ్షీట్ కూడా నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది. సింథటిక్ బెడ్షీట్లు వేడిని ఎక్కువగా నిల్వ చేస్తాయి. కానీ కాటన్ బెడ్షీట్లు గాలి ప్రసరణకు సహాయపడుతూ చల్లదనాన్ని ఇస్తాయి. శుభ్రంగా ఉతికిన కాటన్ బెడ్షీట్ వాడితే శరీరానికి హాయిగా అనిపించి త్వరగా నిద్ర వస్తుంది.

నిద్రకు ముందు గోరువెచ్చగా లేదా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. రోజంతా వేడి కారణంగా వచ్చిన అలసట కూడా తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర త్వరగా పట్టడమే కాకుండా మధ్యలో మేల్కొనే సమస్య కూడా తగ్గుతుంది.

రాత్రి వేళల్లో ఎక్కువ మసాలా, ఆయిల్, కారం ఉన్న ఆహారం తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరిగి కడుపులో మంట, అసౌకర్యం కలగవచ్చు. అందువల్ల రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం, పెరుగు, పండ్లు, దోసకాయ వంటి చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవిలో డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజంతా తగినంత నీరు తాగడం చాలా అవసరం. అయితే నిద్రకు ముందు ఎక్కువగా నీరు తాగితే మధ్యలో పలుమార్లు బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావచ్చు. దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే పగటి సమయంలో ఎక్కువగా నీరు తీసుకుని, రాత్రి నిద్రకు ముందు పరిమితంగా తాగాలని వైద్యులు చెబుతున్నారు.

నిద్రపోయే గదిలో గాలి సరిగా ఆడకపోతే ఉక్కపోత మరింత ఎక్కువగా అనిపిస్తుంది. కిటికీలు కొద్దిసేపు తెరిచి ఉంచడం, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా వెంటిలేషన్ సౌకర్యం ఉండేలా చూడడం మంచిది. ఫ్యాన్ గాలి నేరుగా శరీరంపై కాకుండా గదిలో సర్క్యులేట్ అయ్యేలా ఉంచితే మరింత సౌకర్యంగా ఉంటుంది.

శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవిలో నిద్రలేమి వల్ల అలసట, నీరసం మరింత ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడంతో పాటు హాయిగా నిద్రపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version