Times Group: బెన్నెట్ కోల్ మన్& కో.. అంటే ఎవరికీ తెలియదు గానీ.. టైమ్స్ గ్రూప్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా చొచ్చుకుపోయింది ఈ పేపర్. కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ మాత్రమే కాకుండా, ఎకనమిక్ టైమ్స్, టైమ్స్ నౌ, ఈటీ టైమ్స్ పేరుతో పేపర్, చానల్స్ కూడా నిర్వహిస్తోంది. ఇండియన్ మీడియా రంగంలో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది.. ఈ టైమ్స్ గ్రూపును వినీత్ జైన్, సమీర్ జైన్ నిర్వహిస్తున్నారు. అయితే అంతటి గ్రూపు ఇప్పుడు రెండు ముక్కలు కాబోతోంది. అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది నుంచే ఇందుకు సంబంధించిన మధ్యవర్తిత్వ ప్రక్రియలు మొదలయ్యాయి. అయితే ఇవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది.
ఫైనాన్షియర్ల కోసం ఎదురు చూపులు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పబ్లిషింగ్ వ్యాపారం పొందిన సోదరుడు, మరొక సోదరుడికి వచ్చిన ఆస్తులను లెక్కించిన తర్వాత తదుపరి విభజన జరుగుతోందని తెలుస్తోంది. అయితే పబ్లిషింగ్ వ్యాపార నిర్వహణకు గాను ఫైనాన్షియర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వివిధ ఆర్థిక సంస్థలతో టైమ్స్ గ్రూప్ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.
దెబ్బకొట్టింది
కోవిడ్ టైమ్స్ గ్రూప్ పై తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ ముందు దేశంలోనే థర్డ్ హైయెస్ట్ సర్క్యులేటెడ్ ఇంగ్లీష్ పేపర్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఉండేది. అయితే కువైట్ తర్వాత సర్కులేషన్ పడిపోవడం, అదే క్రమంలో యాడ్స్ కూడా రాకపోవడంతో టైమ్స్ గ్రూప్ డిజిటల్ విభాగంలోకి వెళ్ళింది.. చాలా ఎడిషన్లను మూసివేసింది. పేపర్, రంగుల ధరలు పెరిగిపోవడం, అదే స్థాయిలో ప్రకటనలు రాకపోడంతో టైమ్స్ గ్రూపు ఆలోచనలో పడింది. ఆర్థిక అంచనాలు తారుమారు కావడంతో ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో గ్రూపులో ఆస్తులు పంచుకోవాలని ఇద్దరు సోదరులు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
28 బిలియన్ డాలర్లు
టైమ్స్ గ్రూప్ ఆస్తుల విలువ ఓపెన్ మార్కెట్ ప్రకారం 28 బిలియన్ డాలర్లు. ఇది పబ్లిషింగ్, టెలివిజన్ రంగంలో అగ్రగామిగా ఉంది. దేశంలోని మెట్రో సిటీల్లో పేపర్ ఎడిషన్లు కలిగి ఉంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, ఈ_ కామర్స్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టింది. అయితే ఈ గ్రూపు విభజనకు సంబంధించి ఇటువంటి వార్తలు రాకపోయినప్పటికీ..బ్లూమ్ బర్గ్ అనే వెబ్ సైటు దీని గురించి రాయడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్ విభాగంలో అదాని గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఎన్డీటీవీని టేక్ ఓవర్ చేసిన అదానీ… టైమ్స్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి మీడియాలోనూ నెంబర్ వన్ గా ఎదగాలని యోచిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.