Subha Muhurtham: మొన్నటిదాకా శుభకార్యాలు జోరుగా సాగాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, జువెలరీ షాప్స్.. ఇలా రకరకాల వ్యాపారాలు వందల కోట్లల్లో జరిగాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికీ బ్రేక్ పడింది. ఎందుకంటే వచ్చే మూడు నెలల్లో మంచి ముహూర్తాలు లేకపోవడమే.. ఏప్రిల్ 28 నుంచి ఆగస్టు 4 వరకు దాదాపు మూడు నెలల వరకు ఎటువంటి శుభకార్యాలు జరిపే/ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే గురు, శుక్ర మౌడ్యమితో వైశాఖ, జేష్ట, ఆషాడ మాసాలలో మంచి ముహూర్తాలు లేవట. ఇదే విషయాన్ని పండితులు చెప్తున్నారు.
సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాల మీద పడి ఈ మౌడ్యమి సంక్రమిస్తున్నదని పండితులు చెప్తున్నారు. దీనివల్ల గ్రహాల గమనం గతి తప్పిందని, అందువల్ల శుభ ముహూర్తాలు పెట్టడం సాధ్యం కావడం లేదని పండితులు చెప్తున్నారు. అందు వల్లే తిథులతో ముడిపడి ఉన్న వివాహాలు, గృహప్రవేశాలు, యజ్ఞాలు, యాగాలు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టడం కుదరడం లేదని చెబుతున్నారు.. వాస్తవానికి మనదేశంలో శుభకార్యాలు ముహూర్తాల ఆధారంగానే జరుగుతుంటాయి. ఆ ముహూర్తాలను గ్రహాల గమనాల ఆధారంగా అర్చకులు నిర్ణయిస్తుంటారు. ఆ ముహూర్తాలలోనే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. అయితే ఆగస్టు వరకు గ్రహాల గమనాలు అర్థం కాకపోవడంతోనే ఆ కాలానికి అర్చకులు మౌడ్యం అని పేరు పెట్టారు.
ఆగస్టు 3 తర్వాత శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు అర్చకులు. ఆ కాలంలోనే వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది నిన్నటి వరకు వివాహాలు, ఇతర శుభకార్యాలు జోరుగా సాగాయి. వీటి ఆధారంగా వందల కోట్ల వ్యాపారం జరిగింది.. ఈ మూడు నెలల్లో మంచి ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలావరకు వ్యాపారాలలో స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది. ఆగస్టు తర్వాత ఊపందుకుంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శ్రావణమాసం తర్వాత కార్తీకమాసంలోనూ మంచి ముహూర్తాలున్నాయని, అప్పుడు కూడా శుభకార్యాలు జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.. ఇక ఇటీవల సమ్మర్ సీజన్లో దేశవ్యాప్తంగా లక్షలాది వివాహాలు జరిగాయని మాట్రిమోనీ సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక అనధికారికంగా జరిగిన వివాహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని వారు వివరిస్తున్నారు. మనదేశంలో వివాహ మార్కెట్ ఒకప్పుడు పదివేల కోట్ల వరకే ఉండేదని.. ఇప్పుడు అది దాదాపు లక్ష కోట్లకు చేరుకుందని.. ఈవెంట్ ఆర్గనైజర్లు చెబుతున్నారు.