
India Vs Australia 2nd Test: టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాగపూర్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండో టెస్టు ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి టెస్టులో లభించిన విజయంతో టీమిండియా ఉత్సాహంతో ఉంది. కంగారూలను మరోసారి కట్టడి చేయాలని భావిస్తోంది. ఇందుకు గాను పటిష్ట చర్యలు తీసుకుంటోంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. మరోవైపు ఆసీస్ కూడా తొలి టెస్టులో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టులో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టీమిండియా ముందు మరో సవాలు ఎదురవుతోంది. రెండో టెస్టుకు శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో ఎవరిని పక్కన పెట్టాలో తేల్చుకోలేకపోతోంది. రోహిత్, ద్రవిడ్ కు సవాలు పలుకుతున్నాయి పరిస్థితులు. విడువు మంటే పాముకు కోపం పట్టుమంటే కప్పకు కోపం అన్నట్లుగా వారి పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి స్థానం ఇవ్వాలో ఎవరిని పక్కన పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇదో పెద్ద తలనొప్పిగా మారింది.
శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లలో ఎవరిని ఆడించాలనేదానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఇందులో ఎవరిని పక్కన పెట్టాలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. వికెట్ కీపర్ గా భరత్ ను ఆడించాలా? లేక నాలుగో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలా? అనేది సందిగ్ధంగా అనిపిస్తోంది. మేనేజ్ మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. జట్టు కూర్పులో ఏ ప్రాతిపదికన ఆటగాళ్లను తీసుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.

శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడంతో ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయి. తన సొంత ప్రాంతం కావడంతో అయ్యర్ ఆడించాలా? వద్దా? అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఓపెనర్ గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇదే రాహుల్ కు చివరి అవకాశంగా చెబుతున్నారు. ఇందులో రాణించకపోతే ఇక దేశవాళీ క్రికెట్ కే పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తానికి టీమిండియాకు ఆటగాళ్ల ఎంపిక ఓ సవాలుగా మారింది.
ఎవరిపై వేడు పడనుందో?
నాలుగో స్థానంలో కోహ్లి రానున్నాడు. ఐదో బ్యాట్స్ మెన్ గా సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగనున్నాడు. అయ్యర్ ను ఆడించాలంటే సూర్యపై వేటు తప్పదు. శుభ్ మన్ గిల్ కు అవకాశం ఇవ్వాల్సి వస్తే కేఎస్ భరత్ తో పాటు సూర్యకు కూడా ఉద్వాసన తప్పదు. ఈ నేపథ్యంలో టీం కూర్పుపై మేనేజ్ మెంట్ ఏ చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. మిడిలార్డర్ లో రాహుల్ ఆడితే అతడే కీపింగ్ చేస్తాడు. గాయాలైతే తప్ప తొలి టెస్టు వారితోనే ఆడించాలని అనుకుంటోంది. కుల్దీప్ కు మరోసారి చేదు అనుభవమే ఎదురు కావచ్చు. సిరాజ్, మహ్మద్ షమీలకు బెర్తులు ఖాయంగానే కనిపిస్తున్నాయి.
తుది జట్లు అంచనా ప్రకారం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, సిరాజ్ ఉండనున్నారు.