Enjoy your freedom: మానవ జీవితంలో కూడు, గుడ్డ, ఆవాసం.. ముఖ్యమైన ప్రాధాన్యాలు. కానీ వీటికి మించిన గొప్ప ప్రాధాన్యం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ప్రతీ మనిషి మనసుకు కూడా స్వేచ్ఛ కావాలంటున్నారు. మనసు ఎన్ని ఆలోచించినా.. వాటి అమలులో అవాంతరాల కారణంగా మనిషి ఒత్తిడికి లోనవుతాడు. అయతే మనసుకు స్వేచ్ఛ దొరికితే అంతకు మించి సంతోషం ఉండదంటున్నారు. ఆర్థికంగా ఉన్నా.. భౌతికంగా బాగున్నా.. మానసిక స్వేచ్ఛ లేకపోతే మాత్రం క్షణాలు కూడా తట్టుకోలేడు.
రాజ్యాంగ హామీలు..
భారత రాజ్యాంగం పార్ట్–3 (ఆర్టికల్స్ 12–35)లో పౌరులకు సమానత్వం, మత స్వాతంత్య్రం, సాంస్కృతిక హక్కులు, విద్యా అవకాశాలు అందించింది. ముఖ్యంగా ఆర్టికల్స్ 19–22 ప్రకారం మాట్లాడే, భావాలు చెప్పే, సమావేశాలు నిర్వహించే, సంఘాలు ఏర్పాటు చేసే, వృత్తి ఎంపికలో స్వేచ్ఛలు ఇచ్చాయి. ఇవి పౌరులకు ఉన్నతమైన స్వేచ్ఛను అందిస్తున్నాయి.
హక్కులతోపాటు బాధ్యతల భారం
ఎలాంటి హక్కూ ఒంటరిగా ఉండదు. ప్రతి స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. మాటల హక్కు ఇతరులకు భంగం కలిగించకూడదు. ఎవరి మనసూ నొప్పించకూడదు. విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ఇక సమావేశాలు సమాజ శ్రేయస్సుకు విఘాతం కలిగించకూడదు. సభ్యతా నియమాలకు కట్టుబడి, పరస్పర గౌరవంతో హక్కులు ఆస్వాదించాలి. పౌరుల వివేకం ఇక్కడే పరీక్ష అవుతుంది.
అసలు స్వేచ్ఛ ఇదే..
మెదడులో పుట్టే ఆలోచనల స్వాతంత్య్రమే నిజమైన స్వేచ్ఛ. బాహ్య ప్రభావాలు లేకుండా సొంత అభిప్రాయాలను వ్యక్తీకరించే వాతావరణం తప్పనిసరి. ఆలోచనలను కట్టిపడేసి మిగతావి ఇచ్చినా ఆ స్వేచ్ఛకు విలువ ఉండదు. భౌతిక ఆకర్షణల్లో మునిగిపోతే అసలు లాభం కోల్పోతాము.
స్వాతంత్య్ర పోరాటంలో జైలు బంధనాల్లో చిక్కుకున్న నాయకులు తమ మానసిక శక్తిని కోల్పోలేదు. ఇనుప గొలుసులు వారి ఆలోచనలను అడ్డుకోలేవు. జైలు నుంచే వారు ప్రజలకు సందేశాలు పంపారు. ఈ మనసు బలం వల్లనే ఉద్యమం విజయం సాధించింది. మనసు స్థిమితంగా ఉంటే అన్ని స్వేచ్ఛలు స్వయంచాలకంగా వస్తాయి.