T20 World Cup 2022- Strongest Players: ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే 50 ఓవర్లు ఉండేది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఈ మూడు అవిభాగాల్లో సమతూకంగా రాణించిన జట్టే గెలుపొందుతూ వచ్చేది. కానీ కొత్తగా చింత, పాతకు రోత అన్నట్టు క్రికెట్ మ్యాచ్ ల్లోనూ సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. 2007లో టి20 పేరుతో అంతర్జాతీయ క్రికెట్ కొత్త తరహా ఫార్మాట్ ను అభిమానులకు పరిచయం చేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ ఫార్మాట్ ఎంతోమంది వర్ధమాన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చింది. వేలకోట్ల వ్యాపారానికి ఇప్పుడు కీలక స్థానం అయింది. అయితే టి 20 ఫార్మాట్లో బాదుడే ప్రధాన అస్త్రం కాబట్టి.. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించే ఎనిమిదవ టి20 వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ బాద్ షా ల పై ఒక లుక్ వేద్దాం రండి.
విరాట్ కోహ్లీ
భారత జట్టులో సచిన్ టెండూల్కర్ తర్వాత సెంచరీలను మంచి నీళ్లు తాగినంత సులభంగా కొట్టేస్తున్న క్రీడాకారుడు. బలమైన ఫోర్హ్యాండ్ షాట్లు ఆటల్లో దిట్ట. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల బంతిని బౌండరీ దాటించగల మొనగాడు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లతో ఫామ్ లోకి వచ్చాడు. కళాత్మకమైన బ్యాటింగ్ కు బ్రాండ్ అంబాసిడర్. టి20 వరల్డ్ కప్ లో అనుభవశాలి. ఈ టోర్నీల్లో 21 మ్యాచ్లు ఆడాడు. 129.60 స్ట్రైక్ రేట్ తో 845 పరుగులు సాధించాడు. ఇందులో 10 అర్థ సెంచరీలు ఉన్నాయి. చేజింగ్ లో ఇతడిని మాస్టర్ అనడంలో అతిశయోక్తి కాదు.

సూర్య కుమార్ యాదవ్
సూర్యుడి వెలుగు 360 డిగ్రీలు ప్రసరించినట్టు.. ఇతడి బ్యాటింగ్ కూడా 360 డిగ్రీల్లో ప్రతి కోణాన్ని స్పృశిస్తుంది. మైదానంలో ఏ మూలకైనా షాట్ కొట్టగలడు. అందుకే ఇతడిని 360 డిగ్రీస్ బ్యాట్స్మెన్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకుంటారు. భారత బ్యాటింగ్ దళంలో తురుపు ముక్క. 34 మ్యాచ్లు ఆడి ఏకంగా 176.81 స్ట్రైక్ రేట్ తో 1,045 పరుగులు చేశాడు. ఎంత బలంగా ఆడతాడో.. ఒక్కోసారి అంతటి నిర్లక్ష్యపు షాట్లు ఆడి ఔట్ అవుతూ ఉంటాడు.

గ్లెన్ మ్యాక్స్ వెల్
అనుభవజ్ఞుడు. టి 20 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా కి ఒంటి చేత్తో విజయాలు అందించాడు. ఆల్ రౌండర్ కావడం ఇతడి అదనపు బలం. ఇప్పటివరకు 92 మ్యాచులు ఆడాడు. 151.45 స్ట్రైక్ రేటుతో 2,025 పరుగులు ఇతడి ఖాతాలో ఉన్నాయి.

బెన్ స్టోక్స్
బంతిని నిర్దాక్షిణ్యంగా బాదే అతికొద్ది ఆటగాళ్లలో ఇతడికి మొదటి స్థానం ఉంటుంది. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ కు తొలి వరల్డ్ కప్ అందించిన ఘనత ఇతడి సొంతం. హార్డ్ హిట్టింగ్ లో ఇతడికి ఇతడే సాటి. ఇప్పటివరకు 34 మ్యాచులు ఆడాడు. 136.84 స్ట్రైక్ రేటుతో 442 పరుగులు చేశాడు.

డేవిడ్ మిల్లర్
దక్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాట్స్మెన్ బౌలర్ల పాలిట కిల్లర్. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుకు మిడిల్ ఆర్డర్ మూల స్తంభం. పరుగుల వరద పారించడంలో సిద్ధహస్తుడు. ఇప్పటివరకు 107 టి20 మ్యాచ్ లు ఆడాడు. 145.69 స్ట్రైక్ రేట్ తో 2069 పరుగులు చేశాడు.

గ్లెన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ కు చెందిన ఈ ఆటగాడు.. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా అడగలడు. బంతిని కసి తీరా బాదడం ఇతడి నైజం. తనదైన రోజున ఇతడిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. భారీగా సిక్సర్లు కొడతాడు. పవర్ హిట్టర్ గా పేరొందాడు. 44 మ్యాచ్ లు ఆడి 141.76 స్ట్రైక్ రేటుతో 964 పరుగులు చేశాడు.

అసిఫ్ అలీ
ఈ పాకిస్తాన్ క్రీడాకారుడు భారీ సిక్స్ లు కొట్టే మొనగాడు. నిరుడు జరిగిన టి20 ప్రపంచ కప్ లో విశేషంగా రాణించాడు. ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడాడు. 135.62 స్ట్రైక్ రేట్ తో 514 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ సారధి బాబర్ అజమ్ కూడా ప్రమాదకరమైన ఆటగాడు. ఇతడు కూడా అన్ని ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉన్నవాడు. బలమైన షాట్లు కొట్టడంలో దిట్ట. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు బాదగలడు. ఇప్పటివరకు 83 మ్యాచులు ఆడాడు. 129.2 స్ట్రైక్ రేట్ తో చక్కటి స్కోర్ సాధించాడు.
