Virat Kohli: నిత్యం పోటెత్తే సముద్రం ఎక్కడో ఒకచోట విశ్రాంతి తీసుకుంటుంది.. క్రూరంగా వేటాడే పులి ఎప్పుడో ఒకప్పుడు విశ్రమిస్తుంది..ఒకప్పుడు విరాట్ కూడా సముద్రం మాదిరి శతకాలతో పోటెత్తిన వాడే. ప్రత్యర్థి బౌలర్లపై పులిలాగా విరుచుకుపడిన వాడే. కానీ అలాంటి కోహ్లీ నెమ్మదించాడు. పోటీలో వెనుకబడ్డాడు. అలవోకగా శతకాలు బాదినవాడు రెండు అంకెల స్కోర్ చేసేందుకే ఆపసోపాలు పడ్డాడు. అందరూ గేలి చేశారు. జట్టుకు భారమన్నారు. ఇంకా ఎందుకు ఎంపిక చేస్తున్నారని సెలెక్టర్లను దుయ్య పట్టారు.. కోహ్లీ అన్నింటిని మౌనంగా భరించాడు.. తర్వాత తనను తాను ప్రశ్నించుకున్నాడు.. కఠినమైన సాధన చేశాడు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో పాత కోహ్లీని అభిమానులకు గుర్తు చేస్తున్నాడు.

సెంచరీలను అలవోకగా బాది, అసాధ్యం అనుకున్న విజయాలను సాధ్యం చేసి, భారత జట్టుకు చిరస్మరణీయమైన కప్ లను అందించిన కోహ్లీ 2023లో కొత్తగా కనిపిస్తున్నాడు. ఒకప్పటి పాత కోహ్లీని అభిమానులకు గుర్తు చేస్తున్నాడు.. 2023 ఏడాది మొదలైనప్పటి నుంచి 2016 నాటి ఆట తీరును జ్ఞప్తికి తీసుకొస్తున్నాడు. ఇక ఏడాది శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో రెండు శతకాలు బాదాడు అంటే కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. చివరి వన్డేలో అయితే కేవలం 110 బంతుల్లో 166 పరుగులు చేసి దుమ్ము లేపాడు.. ఈ ఇన్నింగ్స్ తో తన కెరియర్ లో రెండవ అత్యధిక స్కోర్ సాధించడమే కాకుండా… పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. భారత్ లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.. 20 సెంచరీలతో టాప్ లో ఉన్న దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు.. అంతేకాదు తాను పూర్తిస్థాయిలో టచ్ లోకి వస్తే అది చాలా కాలం ఉంటుందని, వన్డే వరల్డ్ కప్ కు ముందు తన నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ లు రావడం ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పాడు.

ఈ సెంచరీల వెనుక ఆ ముగ్గురు
కోహ్లీ ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారి పేర్లు రఘు,దయ, నువాన్. నెట్స్ లో వారు అవిశ్రాతంగా శ్రమించడంతో తాను ఈ స్థాయిలో విజయవంతమవుతున్నానని కోహ్లీ చెప్తున్నాడు.. నెట్స్ లో 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తుంటే కోహ్లీ వాటిని దీటుగా ఎదుర్కొంటున్నాడు.. వీరు లేకపోతే కోహ్లీ ఈ స్థాయిలో రాటుదేలేవాడు కాదు.. మరోవైపు ఆ ముగ్గురి వ్యక్తుల్లో నువాన్ శ్రీలంక దేశీయుడు..వీరు నెట్స్ లో బంతులు చేస్తున్నారంటే… అనామకులు అనుకోవద్దు.. వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్ళే.. అందుకే కోహ్లీ ఏరి కోరి వారిని ఎంచుకున్నాడు.. కఠినంగా సాధన చేసి రెచ్చిపోయేలా ఆడుతున్నాడు.