Sankranti 2023: సింగిల్ ఫ్యామిలీ. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు.. మూడు పదులు దాటిన వయసు.. నాలుగు చక్రాల వాహనం.. ఐదు అంకెల జీతం.. ఇవేవీ సంతృప్తి ఇవ్వడం లేదు. వీకెండ్ పార్టీలు అనుభూతిని ఇవ్వడం లేదు.. అందుకే నగరవాసులు సంక్రాంతి పండుగకు పల్లె బాట పట్టారు.. రైళ్ళు, బస్సుల ద్వారా సొంత ఊర్లకు తరలి వెళ్లిపోయారు.. పోయే వాహనాలతో పంతంగి టోల్ ప్లాజా కిక్కిరిసిపోయింది.

మూడు రోజుల మజా
సంక్రాంతి పండుగ మూడు రోజులపాటు జరుపుకుంటారు.. ఆంధ్రలో ఈ పండుగను మరింత ఆడంబరంగా నిర్వహిస్తారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనం రెట్టించిన ఉత్సాహంతో పండగ జరుపుకుంటున్నారు.. కోవిడ్ సమయంలో ఆంక్షలు ఉండడంతో జనం పెద్దగా ఊర్లకు వెళ్లలేదు.. పైగా గత కొద్ది సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. పైగా పండగకు అందరూ వస్తారు కనుక ఆ సందడి వేరే విధంగా ఉంటుంది. ఇక హైదరాబాద్ ప్రాంతంలో ఐటి ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు కాబట్టి… ఈసారి సంక్రాంతి పండుగ శని, ఆదివారాల్లో రావడంతో అందరూ కూడా సొంత ఊర్లకు వెళ్లిపోయారు.
ఊరంటే ఊరే
ఆహార అన్వేషణకు పొద్దంతా తిరిగిన పక్షులు చివరికి గూళ్లకు చేరినట్టు… ఉద్యోగం కోసం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లోకి వలస వెళ్లిన వారంతా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లిపోయారు.. పుట్టిన ఊరిపై ఎవరికైనా ఎనలేని మమకారం ఉంటుంది. ఆ మమకారమే వారిని కట్టిపడేస్తుంది.. కంప్యూటర్ యుగంలో కూడా మనుషులను సొంత ఊర్లకు వెళ్లిపోయేలా చేస్తుంది అంటే మన సంస్కృతి ఎంత గొప్పది.. ఇక ఊర్లలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలు, వివిధ రకాలైన క్రీడలు ఎక్కడా లేని ఉత్సాహాన్ని తీసుకొస్తాయి.. అందుకే కాబోలు నగరమంతా ఇప్పుడు పల్లెల్లోకి షిఫ్ట్ అయింది..

ఆప్యాయతలు
పుట్టి పెరిగిన ఊరు తో మనకు ఉండే అటాచ్ మెంట్ అంతా ఇంతా కాదు. ఈ దేశమేగినా, ఎక్కడ కాలు పెట్టినా మన ఊరి మూలలు మనలో భద్రంగా ఉంటాయి. అవే మనల్ని మళ్లీ మన ఊరికి చేరవేరుస్తాయి.. పండగ పూట ఉన్న నాలుగు రోజులు అనంతమైన జ్ఞాపకాలను మనకు అందిస్తాయి.. ఆ జ్ఞాపకాలతో సంవత్సరమంతా ఆనందంగా గడపాలని నిర్దేశిస్తాయి.. మరో సంక్రాంతి పండుగకు ఉత్సాహంగా రావాలని సంకేతాలు ఇస్తాయి.. అందుకే కదా పండగ అనేది మన సంస్కృతి.. పుట్టిన ఊరు మన సంప్రదాయం.. ఈ రెండింటి మేళవింపే సంక్రాంతి.. ఇది మన పండుగ. మట్టి పండుగ. మనలో మట్టి మనిషి అస్తిత్వాన్ని తట్టి లేపే పండుగ.